రైతులకు అండగా ఉంటాం
మంత్రి సవిత
వీరపునాయునిపల్లె: రాష్ట్రంలోని ప్రతి రైతును ఆదుకోని వారికి అండగా నిలవడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఉల్లి రైతులకు చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రైతులు సాగు చేసిన పంటకు గిట్టుబాటు ధర లేక పోగా అధిక వర్షాలు పడడంతో తీవ్రంగా నష్టపోయారన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పంటనష్ట పరిహారం మంజూరు చేశామన్నారు. కలెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ రైతులు మార్కెట్‌కు అనుకూలంగా పంటలు సాగు చేయాలని అలా కాకుండా పంటలు సాగు చేస్తే నష్టాల బారిన పడాల్సి వస్తుందన్నారు. అనంతరం రాజ ముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలు, ఉల్లి పంటకు సంబందించిన మెగా చెక్కును మంత్రి సవిత రైతులకు అందజేశారు. ఎమ్మెల్యే పుత్తా చైతన్యకుమార్‌రెడ్డి, టీడీపీ రాష్ట ఉపాధ్యక్షుడు నరసింహారెడ్డి, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
రైతులకు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ
నందలూరు: నల్లతిమ్మయ్యగారిపల్లె గ్రామ పంచాయతీ ఎల్లమ్మరాజుపల్లె గ్రామంలో మంగళవారం మీ భూమి మీ హక్కు కార్యక్రమాన్ని నిర్వహించారు.మంత్రి సవిత హాజరై రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేశారు.


