పేదలకు అందని స్కానింగ్‌ సేవలు! | - | Sakshi
Sakshi News home page

పేదలకు అందని స్కానింగ్‌ సేవలు!

Jan 7 2026 7:35 AM | Updated on Jan 7 2026 7:35 AM

పేదలక

పేదలకు అందని స్కానింగ్‌ సేవలు!

ప్రొద్దుటూరు క్రైం : జిల్లా ప్రభుత్వాసుపత్రిలో స్కానింగ్‌ సేవలు సక్రమంగా అందడం లేదు. దీంతో పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లా ఆస్పత్రిలో రోజుకు 950–11000 వరకు ఓపీ ఉంటుంది. ఐపీ వార్డుల్లో సుమారు 350–400 మంది వరకు చికిత్స పొందుతుంటారు. ఎక్స్‌రే, ల్యాబ్‌ టెస్టులు కూడా వందల్లోనే జరుగుతుంటాయి. వేగంగా వ్యాఽధి నిర్ధారణ జరిగి, రోగులకు నాణ్యమైన వైద్యం అందాలనే ఉద్దేశంతో.. జిల్లా ఆస్పత్రిలో పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్ట్‌నర్‌షిప్‌ పద్ధతిలో సీటీ, ఎంఆర్‌ఐ స్కానింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేశారు. ిసీటీ స్కాన్‌ సెంటర్‌ కొన్నేళ్ల ముందు నెలకొల్పినా ఎంఆర్‌ఐ మాత్రం 2019లో ఏర్పాటు చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రిలో నిరంతరాయంగా పేద ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉచిత ిసీటీ, ఎంఆర్‌ఐ స్కాన్‌ సేవలు జరిగేవి. ప్రజాప్రతినిధుల సిఫార్సు లేకుండానే ప్రొద్దుటూరుతోపాటు పరిసర నియోజకవర్గాల ప్రజలకు స్కానింగ్‌ సేవలు అందేవి. ప్రభుత్వ వైద్యులు సూచించిన వారికి ఉచితంగా స్కాన్‌ చేసి రిపోర్టు ఇచ్చి పంపించేవారు. ఒక వేళ పేషెంట్‌కు ఎంఆర్‌ఐ ఫిల్మ్‌ కావాలంటే మాత్రం అన్ని హాస్పిటల్స్‌ మాదిరే ఒక్కో ఫిల్మ్‌కు రూ. 250 చొప్పున తీసుకొని ఇచ్చేవారు. అయితే ఏడాదిన్నర నుంచి ఆస్పత్రికి వచ్చే రోగులు భిన్నమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ిసీటీ, ఎమ్మార్‌ఐ స్కానింగ్‌ల విషయంలో ఆస్పత్రి అధికారులు పూర్తిగా ఆంక్షలు విధించారు.

అభద్రతా భావంలో జిల్లా ఆస్పత్రి వైద్యులు

విపరీతమైన తలనొప్పి, వెన్ను నొప్పి తదితర అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్‌కు వచ్చిన వారికి కూడా వైద్యులు, స్పెషాలిటీ వైద్యులు స్కానింగ్‌లు రాయడం లేదనే విమర్శలు ప్రజల నుంచి వస్తున్నాయి. రక్త పరీక్షల పేరుతో కొందరు వైద్యులు కాలయాపన చేస్తున్నారని రోగులు వాపోతున్నారు. రోజుల తరబడి హాస్పిటల్‌కు వస్తున్నా సమస్య తీరకపోవడంతో.. విసుగు చెంది అనేక మంది ప్రైవేట్‌ హాస్పిటల్స్‌, స్కానింగ్‌ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. ఎంఆర్‌ఐ, ిసీటీ స్కాన్‌లు రాయాలని కోరితే.. అవసరం లేదుపో అని పంపిస్తున్నారని అనేక మంది రోగులు అంటున్నారు. ఏడాది క్రితం ఎంఆర్‌ఐ విషయంలో ఉన్నతాధికారుల నుంచి కొందరు వైద్యులకు మెమోలు వచ్చాయి. అప్పటి నుంచి వైద్యుల్లో అభద్రతా భావం నెలకొన్నట్లు తెలుస్తోంది. సీటీ, ఎంఆర్‌ఐ రాయాలంటేనే భయపడే పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పీపీపీ విధానంలో ఏర్పాటు చేసిన స్కానింగ్‌ సెంటర్లలో ఫిల్మ్‌ అవసరమైన పేషెంట్లకు ఒక్కో ఫిల్మ్‌కు రూ.250 చొప్పున తీసుకొని ఇస్తున్నారు. అయితే జిల్లా ఆస్పత్రిలోని ఎంఆర్‌ఐ సెంటర్‌లో నెల రోజుల పాటు ఫిల్మ్‌ ఇవ్వలేదు. డబ్బు ఇస్తామని పేషెంట్లు ప్రాధేయపడ్డా ఉన్నతాధికారుల ఆదేశాలంటూ ఫిల్మ్‌ ఇవ్వకుండా నిలిపేశారు. ఈ కారణంతో జిల్లా ఆస్పత్రిలో 80 శాతం మేర స్కానింగ్‌ సేవలు క్షీణించాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రోజుకు 20–25 ఎంఆర్‌ఐ స్కాన్‌లు జరుగుతుండగా ప్రస్తుతం రోజుకు 6–7 మాత్రమే చేస్తున్నారు. అలాగే ిసీటీ స్కానింగ్‌లు కూడా ప్రతి రోజు 50–60 వరకు జరుగగా.. ఇప్పుడు రోజుకు 15–20 మాత్రమే జరుగుతున్నాయి. స్కానింగ్‌ సేవల్లో రాష్ట్రంలోనే ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రి అట్టడుగున ఉంది. జిల్లాలో కడప రిమ్స్‌ తర్వాత ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రిలో సిటీ, ఎంఆర్‌ఐ సెంటర్లు ఉండటంతో ఎక్కువ మంది పేదలు ఉచితంగా స్కానింగ్‌ తీయించుకునేందుకు ఇక్కడికి వస్తుంటారు. ఆంక్షల పేరుతో స్కానింగ్‌ చేయకపోవడంతో ఆస్పత్రికి వచ్చి అనేక మంది నిరాశతో వెనుతిరిగి వెళ్తున్నారు. రూ. వేలు చెల్లించి ప్రైవేట్‌ స్కాన్‌ సెంటర్లలో స్కానింగ్‌ తీయించుకుంటున్నారు.

ఎమ్మెల్యేల సిఫార్సు లెటర్లు ఉంటేనే..

స్కానింగ్‌లు బాగా తగ్గిపోవడంతో ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రిలోని ఎంఆర్‌ఐ స్కానింగ్‌ సెంటర్‌ను నిర్వాహకులు ఎత్తేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అగ్రిమెంట్‌ కాలపరిమితి పూర్తి కాగానే ఇక్కడి నుంచి తీసేయాలని కంపెనీ యోచిస్తున్నట్లు సమాచారం. ఇదే కనుక జరిగితే పేదలపై తీవ్ర భారం పడే అవకాశం ఉంది. దీనిపై పూర్తి స్థాయి స్పష్టత లేకున్నా ప్రచారమైతే ఎక్కువగా జరుగుతోంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి జిల్లా ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలపై తరచూ అధికారులతో మాట్లాడేవారు. నెలలో ఒక మారైనా ఆయన ఆస్పత్రికి వెళ్లి పరిశీలించేవారు. ముఖ్యంగా వివిధ వ్యాధులతో వస్తున్న పేదలకు జాప్యం జరగకుండా ఉచితంగా స్కానింగ్‌ సేవలు అందించాలని వైద్యాధికారులకు సూచించేవారు. దీంతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పేద ప్రజలకు సులభంగా ఉచిత స్కానింగ్‌ సేవలు అందేవి. అయితే ప్రొద్దుటూరు కూటమి నాయకులు వారి కార్యకర్తలకు, తెలిసిన వారికి ఎమ్మెల్యే సిఫార్సు లెటర్లు ఇచ్చి పంపిస్తున్నారు కానీ.. పేద ప్రజలందరికీ స్కానింగ్‌ సేవలు అందేలా చర్యలు తీసుకోలేదనే విమర్శలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి.

జిల్లా ఆస్పత్రిలో క్షీణించిన ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్‌ సేవలు

స్కానింగ్‌ రాయడానికి జంకుతున్న వైద్యులు

ఎంఆర్‌ఐ సెంటర్‌ ఎత్తేసే యోచనలో నిర్వాహకులు

లాభపడుతున్న ప్రైవేట్‌ స్కాన్‌ సెంటర్లు

పేదలకు అందని స్కానింగ్‌ సేవలు!1
1/2

పేదలకు అందని స్కానింగ్‌ సేవలు!

పేదలకు అందని స్కానింగ్‌ సేవలు!2
2/2

పేదలకు అందని స్కానింగ్‌ సేవలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement