ప్రజలను డైవర్షన్ చేయడానికి బీటెక్ రవి తంటాలు
● కృష్ణా నీటిని పులివెందులకు తెచ్చిన ఘనత వైఎస్ కుటుంబానిదే
● మీడియాతో మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, వైఎస్సార్‌సీపీ నాయకులు
పులివెందుల : వైఎస్ అవినాష్‌రెడ్డి ప్రెస్ మీట్‌కు కౌంటర్ ఇవ్వడానికి బీటెక్ రవి ఏ నగరంలో ఉన్న స్థావరానికి వెళ్లి సలహాలు తీసుకొని వచ్చాడో, ఇందుకు దాదాపు వారం పైన సమయం పట్టిందా అని మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, వైస్ చైర్మన్ హఫీజ్, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ చిన్నప్ప, వైఎస్సార్‌సీపీ పట్టణ ఉపాధ్యక్షుడు పార్నపల్లె కిశోర్ ఎద్దేవా చేశారు. లేక జూద స్థావరాల నుంచి వచ్చే వాటాల విషయమై మీ అనుచరుల మధ్య వచ్చిన మనస్పర్థల కారణంగా, మీ వారే పోలీసులకు ఫిర్యాదు చేసుకుని అరెస్ట్ అయితే, పోలీస్ వారిపైనే దాడి చేసిన ఘటన నుంచి ప్రజలను డైవర్షన్ చేయడానికి ఇప్పుడు కౌంటర్ గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు. మంగళవారం సాయంత్రం పట్టణంలోని భాకరాపురంలో ఉన్న వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. హంద్రీ నీవా కాలువ నుంచి గతంలో కూడా ఎర్రబల్లె చెరువుకు నీళ్లు ఇవ్వడం జరిగిందని, టైలింగ్ ఫాండ్ వరకు నీరు తీసుకెళ్లాలంటే పెద్ద పైపులైన్ ద్వారా మనకు హక్కుగా ఉన్న చిత్రావతి జలాశయం నుంచి ఎక్కువ మంది రైతులకు మేలు, శాశ్వత పరిష్కారం లభిస్తుందన్న ఉద్దేశంతోనే ఎగువ ప్రాంతంలో ఉన్న చెరువుల్లో నీరు సమృద్ధిగా నిండితే.. కింది ప్రాంతంలో ఉన్న చెరువుకు నీళ్లు రావడం సర్వసాధారణమని, కానీ దీన్ని కూడా గ్రావిటేషన్ ద్వారా నీరు ఇచ్చామని చెప్పుకునే నీ లాంటి అవకాశవాది (బీటెక్ రవి) ఎవ్వరు ఉండరన్నారు.
మేం అడిగే ప్రశ్నలకు ధైర్యం ఉంటే సమాధానం చెప్పు
ఎక్కడో శ్రీశైలం దగ్గర ఉన్న కృష్ణా నీటిని పులివెందులకు తెచ్చిన ఘనత , అలాగే మన ప్రాంతంలో దాదాపు ప్రతి గ్రామానికి, ప్రతి చెరువుకు నీరు తెప్పించింది వైఎస్ కుటుంబమన్నారు. కేవలం కల్లబొల్లి మాటలు, అక్రమాలు, దౌర్జన్యాలు తప్ప ఒక్క రూపాయి అభివృద్ధి లేదని, మన ప్రాంత ప్రజలకు నీవు మంచి చేసింది లేదన్నారు. వేములలో రాత్రికి రాత్రి జరిగిన మైనింగ్ దోపిడీలో నీకు, నీ పార్టీ నేతలకు వాటాలు అందడం వాస్తవమా, కాదా అన్నారు. పులివెందుల ప్రాంతంలో నీ అనుచరులు లోపట్నూతల కోవర్టు వెంగళ్‌రెడ్డి, పులివెందుల క్రికెట్ బుకీ జీవుల రమణ ఇంకా నీ ప్రధాన అనుచరుల కనుసన్నల్లో దాదాపు మూడు జిల్లాల నుంచి జూదరులను తీసుకొచ్చి వారి గృహాలు, తోటల్లో ఆడించి, అలాగే సింహాద్రిపురం, కసనూరులో జరిగే జూద స్థావరాల నుంచి నీకు ముడుపులు అందలేదా అన్నారు. యథేచ్ఛగా సాగుతున్న ఇసుక, మైనింగ్ అక్రమ రవాణాలో నీకు, నీ కుటుంబ సభ్యులకు వాటాలు ఉన్నాయా లేవా అని ప్రశ్నించారు. పార్నపల్లి దగ్గర పట్టుకున్న అక్రమ రేషన్ బియ్యం రవాణాలో నీ హస్తం ఉందా, లేదా నిలదీశారు. వీటన్నింటిపై ఏ దేవుడి సన్నిధిలోకి వచ్చి ప్రమాణ పూర్తిగా నీకు గానీ, నీ కుటుంబ సభ్యులకు గానీ సంబంధం లేదని ప్రమాణం చేయగలవా ప్రశ్నించారు. నియోజకవర్గంలో ప్రతి ఇంటికి నీటిని అందించే వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ పూర్తి చేసి జాతికి అంకితం చేయాలని కాకుండా పులివెందుల మున్సిపాలిటీలో తాగునీటి కష్టాలు తీర్చాలని అడిగినట్లు నిరూపించు, లేకపోతే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రమాణం చేయాలన్నారు. నువ్వు మాట్లాడిన మైనింగ్ గురించి ప్రభుత్వం చేత అన్ని రకాల అప్రూవల్ పొందిన మైన్ ఓనర్ దగ్గర నుంచి లేబర్ కాంట్రాక్టు కింద అగ్రిమెంట్ చేసుకుని లీగల్‌గా మా నాయకులు మైనింగ్ వ్యాపారం చేశారన్నారు. వైఎస్ కుటుంబమంతా ఒక్కటే ఆ కుటుంబంలో ఎటువంటి మనస్పర్థలు లేవని, నీ లాంటి బోగస్, అర్హత లేని నీచ రాజకీయాలు చేసే వారి వ్యాఖ్యల వల్ల ఎటువంటి ఉపయోగం లేదన్నారు.
ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి వ్యక్తిత్వం గురించి మాట్లాడే అర్హత నీకు లేదు
ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి వ్యక్తిత్వం గురించి, మంచితనం, మేథస్సు గురించి నీ లాంటి బ్లఫ్ మాస్టర్ చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఆయన వ్యక్తిత్వంపై ఎంత బురద చల్లినా జిల్లా ప్రజలకు ఆయన పై ఉన్న ఆదరాభిమానాలకు అంతులేదని, గుండెల్లో పెట్టుకొని మూడు సార్లు ఎంపీగా గెలిపించారని అన్నారు. అలాంటి వ్యక్తి గురించి మాట్లాడే, పేరు ఉచ్చరించే అర్హత కూడా నీకు లేదని అన్నారు. ఇకనైనా పులివెందుల ప్రాంతానికి ఏదైనా మంచి చేయాలనే ఆలోచన బోగస్ రవికి ఇవ్వాలని దేవున్ని కోరుతున్నామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు రసూల్, సర్వోత్తమరెడ్డి, కనక తదితరులు పాల్గొన్నారు.


