రాయలసీమ ద్రోహి చంద్రబాబు
ప్రొద్దుటూరు : సీఎం చంద్రబాబు నాయుడు రాయలసీమ, నెల్లూరు జిల్లాల ప్రజల గొంతుకోశాడని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి విమర్శించారు. సాధారణంగా కోడిని కోసేటప్పుడు గొంతులో నీరు పోస్తారని, చంద్రబాబు నీరు పోయకుండానే ప్రజల గొంతు కోశాడని అన్నారు. ప్రొద్దుటూరులోని తన క్యాంప్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జగన్ ప్రభుత్వంలో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి రూ.3,850 కోట్లు మంజూరు చేసి పనులు ప్రారంభించారన్నారు. సాగునీటితోపాటు వ్యవసాయాన్ని అభివృద్ధి చేసేందుకు ఈ పథకాన్ని మంజూరు చేసి వేగవంతంగా పనులు చేపట్టారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పథకాన్ని నిలిపేశారన్నారు. స్వయాన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ తన అభ్యర్థన మేరకు ఈ పథకాన్ని చంద్రబాబు ఆపేసినట్లు తెలిపారని చెప్పారన్నారు. రాయలసీమతోపాటు నెల్లూరు జిల్లాల ద్రోహి చంద్రబాబు అని విమర్శించారు. రాయలసీమకు చంద్రబాబు ప్రభుత్వంలోనే ద్రోహం జరుగుతూ వస్తుందనడానికి ఉదాహరణలు ఉన్నాయని తెలిపారు. కరువు ఛాయలను నివారించేందుకే రాజోలి, జొలదరాశి రిజర్వాయర్ నిర్మాణ పనులను జగన్ ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఇది ఇలా ఉండగా సీమ లిఫ్ట్ ఆపేసింది జగనే అని చంద్రబాబును సంరక్షించేందుకు ఆంధ్రజ్యోతి రోత రాతలు రాయడం తగదన్నారు. తాను ఈ వార్తలను పూర్తిగా ఖండిస్తున్నానన్నారు. అనంతరం ఆంధ్రజ్యోతి పత్రిక ప్రతులను కాల్చారు. అక్షరాలకు సమాజాన్ని మార్చే శక్తి ఉందని, ఇలాంటి తప్పుడు రాతల వల్ల నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. చంద్రబాబును కాపాడేందుకు జర్నలిజాన్ని ఇలా వాడుకుంటారా అని ప్రశ్నించారు. ఇప్పటికై నా టీడీపీ కరపత్రిక ఆంధ్రజ్యోతికి బుద్ధి రావాలని కోరుకుంటున్నానని, ఆ పత్రికను ఎరూ చదవ వద్దని కోరారు.
18 నెలల్లో భోగాపురం ఎయిర్‌పోర్టును పూర్తి చేస్తారా
జగన్ ప్రభుత్వంలో రూ.960 కోట్లతో భోగాపురం విమానాశ్రయ పనులను ప్రారంభించారని రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. 2026 నాటికి ఈ పనులు పూర్తవుతాయని, అప్పటికి జగనే మళ్లీ సీఎంగా ఉండాలని తాను కోరుకుంటున్నానని జీఎంఆర్ సంస్థ ప్రతినిధి తెలిపారన్నారు. అయితే ప్రస్తుతం విమానాశ్రయ పనుల ప్రారంభోత్సవానికి వచ్చిన కేంద్ర మంత్రి గడ్కరి 18 నెలల్లోనే విమానాశ్రయాన్ని పూర్తి చేశారని చంద్రబాబుకు కితాబు ఇవ్వడం తగదన్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో భూ సేకరణ జరిగిందని, పనులు ప్రారంభమయ్యాయని అన్నారు. వాస్తవ సత్యాలు తెలుసుకోకుండా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఇలా మాట్లాడటం తగదన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రజ్యోతి పత్రిక ప్రతులను కాల్చిన
మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి


