హెల్మెట్ ధారణ.. ప్రాణాలకు రక్షణ
కడప అర్బన్ : హెల్మెట్ ధరింపుతో ప్రాణాలు సురక్షితమని, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలని కడప డీఎస్పీ ఎ.వెంకటేశ్వర్లు తెలిపారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు 37వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా కడప నగరంలో మంగళవారం ట్రాఫిక్ పోలీసులు రోడ్డు భద్రతా నిబంధనల ప్రాధాన్యత వివరిస్తూ కోటిరెడ్డి సర్కిల్ నుంచి సంధ్య సర్కిల్ వరకూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతూ ఎక్కువ మంది తలకు గాయం కావడం వల్లే చనిపోతుండటం చూస్తున్నామన్నారు. ఈ విచార ఘటనల వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, హెల్మెట్ ధారణతో ప్రమాదాల నుంచి రక్షణ పొందవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో కడప ట్రాఫిక్ సీఐ సురేష్ రెడ్డి, ఎస్‌ఐ సిద్దయ్య, విద్యార్థులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
రాజంపేట : అన్నమాచార్య యూనివర్సిటీలో మంగళవారం భారతీయ విజ్ఞాన్ వ్యవస్థ క్లబ్‌ను ఏకశిలానగరం శ్రీ పోతన సాహిత్యపీఠం అధ్యక్షుడు పసుపులేటి శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ విజ్ఞాన సంపద, సంస్కృతి, సంప్రదాయలను నేటి విద్యార్ధి లోకం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. అన్నమాచార్య యూనవర్సిటీ ప్రొ చాన్స్‌లర్ చొప్పా అభిషేక్‌రెడ్డి మాట్లాడుతూ భారతీయవిజ్ఙాన వ్యవస్థ క్లబ్‌ను ఏర్పాటు చేయడం శుభపరిణామమన్నారు. కార్యక్రమంలో వీసీ డా.సాయిబాబారెడ్డి, ప్రిన్సిపాల్ డా.నారాయణ, పీజీ కాలేజి ప్రిన్సిపాల్ సమతానాయుడు, సివిల్ డిపార్టుమెంట్ గౌతమి, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.


