రైలు కిందపడి వ్యక్తి మృతి
కడప కోటిరెడ్డిసర్కిల్ : కడప–కృష్ణాపురం రైల్వేస్టేషన్ల మధ్య (రాయచోటి బ్రిడ్జి వద్ద)మంగళవారం ఉదయం ఓ వ్యక్తి రైలు కింద పడి మృతి చెందాడని రైల్వే పోలీసులు తెలిపారు. 55 ఏళ్ల వయస్సు గల ఈ వ్యక్తి షిరిడిసాయి వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు కిందపడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అతను తెల్లటి బనియన్, బెల్ట్ ప్యాంటు, బెల్ట్ ధరించి ఉన్నాడు. కుడిచేయిపై తేలు గుర్తుగల పచ్చబొట్టు ఉంది. మృతుడి ఆచూకీ తెలిసిన వారు తమకు తెలియజేయాలని కడప రైల్వేపోలీసులు కోరారు.
3 ప్రథమ చికిత్స కేంద్రాలు సీజ్
తొండూరు : తొండూరులో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ వైద్య నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రథమ చికిత్స కేంద్రాలపై మండల ప్రజలు జిల్లా కలెక్టర్‌కు స్పందన కార్యక్రమంలో చేసిన ఫిర్యాదుల నేపథ్యంలో.. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు కఠిన చర్యలకు దిగారు. జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారుల ఆదేశాల మేరకు.. ఉప జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఖాజా మొహిద్దీన్ తొండూరు గ్రామంలో ఉన్న మూడు ప్రథమ చికిత్స కేంద్రాలపై మంగళవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని రక్షించాల్సిన కేంద్రాలే ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయన్నారు. అనంతరం నిబంధనలకు విరుద్ధంగా పని చేస్తున్న కేంద్రాలపై పోలీసు శాఖ, మండల మెజిస్ట్రేట్ అయిన తహసీల్దార్‌లకు ఫిర్యాదు చేయగా వారి సహకారంతో మూడు ప్రథమ చికిత్స కేంద్రాలను సీజ్ చేశారు. సంబంధిత నిర్వాహకులకు నోటీసులు జారీ చేసి, పూర్తి వివరాలతో నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించారు. కార్యక్రమంలో డాక్టర్ సుభాషిణి, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ అధికారి మల్లయ్య, ఉప జిల్లా వైద్య ఆరోగ్య కార్యాలయ సిబ్బంది నరేష్, శేఖర్, పోలీస్, రెవెన్యూ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.


