హోరాహోరీగా వాలీబాల్ పోటీలు
జమ్మలమడుగు : 69వ జాతీయ వాలీబాల్ పోటీలు వివిధ రాష్ట్రాల క్రీడాకారుల మధ్య రసవత్తరంగా సాగుతున్నాయి. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీలను జిల్లా స్థాయి అధికారులతోపాటు వాలీబాల్‌గేమ్ అసోసియేషన్‌లు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. మంగళవారం సాయంత్రం అన్ని రాష్ట్రాల క్రీడాకారులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బాలికల జూనియర్ కాలేజీలో పోటీలలో పాల్గొన్న క్రీడాకారులకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్‌రెడ్డి కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సాయిశ్రీ, అధికారులు పాల్గొన్నారు.
అదే జోరులో పశ్చిమబెంగాల్
జాతీయ స్థాయిలో వచ్చిన 30 టీంలలో పశ్చిమ బెంగాల్ క్రీడాకారుల జట్టు బలమైన జట్టుగా కనిపిస్తోంది. గతంలో వాలీబాల్ జాతీయ స్థాయిలో పోటీలలో విన్నర్‌గా నిలిచారు. ప్రస్తుతం అదే జోరు కొనసాగిస్తున్నారు. మంగళవారం జరిగిన పోటీలలో రాజస్థాన్ జట్టు తమ ప్రత్యర్థి అయిన జమ్మూకశ్మీర్‌పై గెలుపొందగా, ఛత్తీస్‌గఢ్‌పై పంజాబ్, గోవాపై ఒడిశా, ఢిల్లీపై విద్యాభారతీ, ఎన్‌వీఎస్‌పై కర్ణాటక, బీహార్‌పై తమిళనాడు, మధ్యప్రదేశ్‌పై హర్యానా, కేవీఎస్‌పై పశ్చిమ బెంగాల్, జమ్మూకశ్మీరుపై గుజరాత్, ఛత్తీస్‌గఢ్‌పై ఢిల్లీ జట్లు గెలుపొందాయి. గురువారం గెలుపొందిన జట్లు మధ్య క్వార్టర్స్ ఫైనల్, సెమీఫైనల్ మ్యాచ్‌లు నిర్వహించి శుక్రవారం ఫైనల్ మ్యాచ్ జరుగుతుందని ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రసాద్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి తెలిపారు.


