రాయలసీమకు చంద్రబాబు మరణశాసనం
● చీకటి ఒప్పందంతో సీమకు ద్రోహం
● ఓటుకు నోటు కేసుకు భయపడి
రేవంత్‌రెడ్డికి దాసోహం
● మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా
కడప కార్పొరేషన్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో చీకటి ఒప్పందం చేసుకొని సీఎం చంద్రబాబు రాయలసీమకు మరణశాసనం రాశారని మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా ఘాటుగా విమర్శించారు. కడపలోని తన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు తన స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టడం దారుణమన్నారు. తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమన్నారు. రాయలసీమ నీటి అవసరాలు తీర్చడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తలపెట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంను ఆపేయడం దుర్మార్గమన్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా రాష్ట్రానికి మేలు జరగదన్నారు. ఆయన సీఎంగా ఉన్న కాలంలో రాయలసీమకు ఒక్క ప్రాజెక్టు కూడా తెచ్చి పూర్తి చేయలేదన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి ఉండటం ఈ ప్రాంత వాసుల దురదృష్టమన్నారు. శ్రీశైలంలో 880 అడుగుల నీటి మట్టం ఉంటేనే రాయలసీమకు నీటిని తీసుకురావడానికి ఆస్కారం ఉంటుందన్నారు. అందుకే దివంగత వైఎస్సార్ పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 11వేల క్యూసెక్కుల నుంచి 44వేల క్యూసెక్కులకు పెంచారని మాజీ డిప్యూటీ సీఎం గుర్తు చేశారు. ఆనాడు తెలంగాణ కాంగ్రెస్ నేతలు అడ్డుపడినా ఈ ప్రాంత ప్రయోజనాలను కాపాడారన్నారు. 854 అడుగుల వద్ద 7వేల క్యూసెక్కులు, 841 అడుగుల వద్ద 2వేల క్యూసెక్కుల చొప్పున డ్రా చేసుకునేందుకు వీలుంటుందన్నారు. శ్రీశైలంలో ఏపీకి 101 టీఎంసీల నికర జలాలు కేటాయించారని, విద్యుత్ ఉత్పత్తి పేరుతో తెలంగాణ 795 అడుగులకు వచ్చేసరికి నీటిని వాడుకోవడం వల్ల ఆ స్థాయిలో నీటిని వాడుకోలేని పరిస్థితి ఉందన్నారు. దీంతో ప్రాజెక్టు ఖాళీ అవుతోందన్నారు. 2004 నుంచి ఇప్పటి వరకూ 2018–19, 2019–20 సంవత్సరాల్లో మాత్రమే వరుసగా 115.40, 179.36 టీఎంసీలు వాడుకోవడం జరిగిందన్నారు. మిగిలిన సంవత్సరాల్లో 50లేదా 60 టీఎంసీలు వాడుకోలేని పరిస్థితి ఉండేదన్నారు. చైన్నె నగరానికి తాగునీటికి 15 టీఎంసీలు, ఎస్‌ఆర్‌బీసీకి 19 టీఎంసీలు, తెలుగు గంగకు 29 టీఎంసీలు, గాలేరు నగరికి 38 టీఎంసీలు రావాలంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక కల్వకుర్తి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, డిండి ఎత్తిపోతల పథకం అక్రమంగా నిర్మించారన్నారు. 2014 నుంచి తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తుంటే చంద్రబాబు వాటిని అడ్డుకోలేకపోయారన్నారు. రాయలసీమ ప్రయోజనాలు కాపాడేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పించి, 800 అడుగుల్లోనే ప్రతిరోజూ 3 టీఎంసీల నీటిని వాడుకునేలా రాయలసీమ ఎత్తిపోతల పథకం రూపొందించారన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపేస్తే రాయలసీమకు చాలా నష్టం జరుగుతుందని, గుక్కెడు మంచినీళ్లకు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుందని హెచ్చరించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ టీడీపీ నాయకులు గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించి కేసు వేశారని, చంద్రబాబే ఇది చేయించారని మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వం గ్రీన్ ట్రిబ్యునల్ ముందు సరైన వాదనలు కూడా వినిపించలేకపోయిందన్నారు. నాలుగు గోడల మధ్య తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో చీకటి ఒప్పందం చేసుకొని రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపేడయం దారుణమన్నారు. రాయలసీమ ప్రయోజనాలు దెబ్బతీసే హక్కు చంద్రబాబుకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. గురుశిష్యులు కలిసి ఏపీకి, ముఖ్యంగా రాయలసీమకు తీరని అన్యాయం చేస్తున్నారని.. దీన్ని వైఎస్సార్‌సీపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. రాయలసీమ టీడీపీ రాయలసీమ నాయకులకు సిగ్గూ, శరం ఉంటే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాయలసీమ ప్రయోజనాలు కాపాడటానికి వైఎస్సార్‌సీపీ ఎంతటి పోరాటమైనా చేయడానికి సిద్దంగా ఉందని తెలిపారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ ఎస్‌ఈసీ సభ్యులు యానాదయ్య, జిల్లా అధికార ప్రతినిధి పి. జయచంద్రారెడ్డి, పార్టీ నాయకులు దాసరి శివప్రసాద్, షఫీ, శ్రీరంజన్‌రెడ్డి,తోటక్రిష్ణ, బి. మరియలు పాల్గొన్నారు.


