నేడు మహిళా పోలీసులకు శిక్షణ
కడప కోటిరెడ్డిసర్కిల్ : జాతీయ ‘బాల్య వివాహ రహిత భారతదేశం‘ ప్రచారంలో భాగంగా గ్రామ, వార్డు సచివాయాలకు చెందిన మహిళా పోలీసులకు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్‌లో ఒకరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఐసీడీఎస్ పీడీ రమాదేవి ఒక ప్రకటనలో తెలిపారు. బాల్య వివాహాల నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు చేయడం ద్వారా బాల్య వివాహాలను నిర్మూలించడానికి జిల్లా స్థాయి శిక్షణా కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. ఈ క్రమంలో కడప కార్పోరేషన్, సీకే దిన్నె ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని మహిళా పోలీసులకు శిక్షణ ఏర్పాటు చేశామని ఆమె వివరించారు.
అప్పుల బాధతో
వ్యక్తి ఆత్మహత్య
పులివెందుల రూరల్ : పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని చిన్న రంగాపురం గ్రామానికి చెందిన రఘు (43) అనే వ్యక్తి సోమవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బంధువుల కథనం మేరకు వివరాలు..రఘు గత కొన్నేళ్లుగా బేల్దారి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతనికి భార్య దేవి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో సుమారు రూ. 10 లక్షలు అప్పు చేశాడు. అయితే అప్పులవాళ్ల బాధ తాళలేక ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటి పెద్ద మృతిచెందడంతో భార్యాపిల్లలు బోరున విలపించారు.
చోరీ కేసులో
నిందితుల అరెస్ట్
మైలవరం : మైలవరం మండలంలోని దొమ్మరనంద్యాల, వేపరాల గ్రామాల్లో జరిగిన చోరీ ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం మైలవరం ఎస్‌ఐ శ్యాంసుందర్‌రెడ్డి విలేకరులకు వివరాలు వెల్లడించారు. జమ్మలమడుగు మండలంలోని గూడెంచెరువు గ్రామానికి చెందిన ఒగ్గు అనిల్, చిన్నెం శ్రీనివాసులు, జక్కా నారాయణలు గత నెల 31వ తేదీ దొమ్మరనంద్యాల, వేపరాల గ్రామాల్లో తాళాలు వేసిన ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. సుమారు లక్షా 45 వేల రూపాయలు నగదు ఎత్తుకెళ్లాకెళ్లారు. అందిన సమాచారం మేరకు వేపరాల గ్రామంలో ముగ్గురిని పట్టుకుని విచారించారు. అనంతరం వారి వద్ద ఉన్న రూ. 56,100 స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరచగా రిమాండ్ విధించినట్లు ఎస్‌ఐ తెలిపారు.
నేడు మహిళా పోలీసులకు శిక్షణ


