నేషనల్ టెక్ జైట్– 25లో విద్యార్థుల ప్రతిభ
వేంపల్లె : ఆర్జీయూకేటీ పరిధిలోని నూజివీడు క్యాంపస్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన టెక్ జైట్ – 25 (2.0)లో ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఘన విజయం సాధించారని డైరెక్టర్ ఏవీఎస్ కుమారస్వామి గుప్తా పేర్కొన్నారు. గతనెల 27 నుంచి 31వ తేదీ వరకు నూజివీడు క్యాంపస్‌లో టెక్ ఫెస్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పోటీల్లో దేశంలోని వివిధ విద్యాసంస్థల నుంచి విద్యార్థులు పాల్గొని క్వాంటం కంప్యూటింగ్, క్వాంటం టెక్నాలజీ వాటి అనువర్తనాలపై సాంకేతిక ప్రతిభను ప్రదర్శించారు. ప్రధాన జ్యూరీ సభ్యులుగా ఐబీఎం హెడ్ డాక్టర్ ఎల్.వెంకట సుబ్రహ్మణ్యం, క్వాంటం ఆంధ్ర మిషన్ డైరెక్టర్ శ్రీధర్, డాక్టర్ యల్లా వంటి ప్రముఖులు హాజరై పోటీలను సమగ్రంగా మూల్యాంకనం చేశారు. జాతీయస్థాయి క్వాంటం మెగా ఎక్స్ పోలో ఆర్కే వ్యాలీ విద్యార్థులు ప్రథమ స్థానం సాధించారు. జాతీయస్థాయి క్వాంటం హ్యాక్‌థాన్‌లో ద్వితీయ, తృతీయ స్థానాలను కై వసం చేసుకున్నారు. విద్యార్థులు జాతీయస్థాయిలో ఉత్తమ ప్రతిభను కనబడచడంపట్ల డైరెక్టర్ ఏవీఎస్ కుమారస్వామి గుప్తా, పరిపాలన అధికారి రవికుమార్, అధ్యాపక బృందం హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రీసర్చ్ డీన్ కొండారెడ్డి, క్వాంటం ఇన్నోవేషన్ సెంటర్ కోఆర్డినేటర్ సుధాకర్ రెడ్డి, క్వాంటం టెక్నాలజీ కోఆర్డినేటర్ భాస్కరయ్య, అధ్యాపకులు మధుమోహన్, తదితరులు పాల్గొన్నారు.


