హిందువులంతా సంఘటితం కావాలి
ప్రొద్దుటూరు కల్చరల్ : హిందువులంతా సంఘటితం కావాలని వేదాంత గీత ఫౌండేషన్ అధ్యక్షుడు ఆచార్య అభినవ శంకరానంద స్వామిజీ పేర్కొన్నారు. స్థానిక శ్రీకృష్ణ గీతాశ్రమంలో ఆదివారం ఘనంగా హిందూ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందువులు సంఘటితం అయితేనే సమాజానికి మేలు అన్నారు. భారత దేశంలో సంస్కృతి సంప్రదాయాల పట్ల విదేశీయులు కూడా మక్కువ చూపుతున్నారన్నారు. హిందూ ధర్మాన్ని, సనాతన సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. కులం గడప వరకే ఉండాలని, గడప దాటితే హిందువులమని తెలిపారు. కార్యక్రమంలో సంగిరెడ్డి శ్రీనివాసులరెడ్డి, కన్నా భాస్కర్, డాక్టర్ సోమా లక్ష్మీనరసయ్య, విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు చీతిరాల నాగార్జున, హిందూ సమ్మేళన సమన్వయకర్త డాక్టర్ వరుణ్‌కుమార్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, మారెళ్ల మల్లికార్జునరావు, నాగమునిరెడ్డి, మురళి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.


