రాయలసీమ ద్రోహి చంద్రబాబు
జమ్మలమడుగు : రాయలసీమ ప్రాంత వాసులు కరువు కాటకాలతో అల్లాడిపోతున్నారు. ఈ ప్రాంత వాసులకు శ్రీశైలం నుంచి రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా రోజుకు మూడు టీఎంసీల నీరు పంపింగ్ చేసుకునే ప్రాజెక్టు పనులకు తెలంగాణ ముఖ్యమంత్రి చెబితే నిలిపివేయడం ద్వారా చంద్రబాబు రాయలసీమ ద్రోహిగా నిలిచిపోయారని ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి విమర్శించారు. ఆదివారం స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాయలసీమ ప్రాంత వాసిగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి శ్రీశైలం నుంచి నాడు 11 వేల క్యూసెక్కుల నీటిని తరలించే విధంగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీని 44 వేలకు పెంచి రాయలసీమ ప్రాంతానికి కృష్ణా జలాలు తీసుకువచ్చారన్నారు. ఏడాదికి వంద టీఎంసీలకు సంబంధించి వరద నీరు రాయలసీమ ప్రాంత వాసులకు కాకుండా మద్రాసు వాసులకు తాగునీటికి కూడా ఉపయోగపడ్డాయన్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో 885 అడుగుల మేర నీరు వస్తేనే రాయలసీమకు నీటిని తరలించాలన్నారు. కానీ తెలంగాణ ప్రాంత వాసులకు 800 అడుగుల ఎత్తు నుంచి విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని వాడుతున్నారన్నారు. రాయలసీమ ప్రాంత వాసులకు తాగునీరు అందించడం కోసం 800 అడుగల ఎత్తు నుంచి రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా రోజుకు మూడు టీఎంసీల నీటిని తరలించే విధంగా నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పనులకు శ్రీకారం చుట్టారని తెలిపారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం రాయలసీమ ప్రాంత వాసుల మనోభావాలను తాకట్టు పెట్టి తెలంగాణకు నీటిని విడుదల చేసి రాయలసీమ ప్రాంత వాసులకు తీరని అన్యాయం చేశారన్నారు. కూటమి నేతలు ఇప్పటికై నా కళ్లు తెరిచి రాయలసీమ ఎత్తిపోతల పనులు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో విచ్చల విడిగా మాదక ద్రవ్యాలు..
రాష్ట్రంలో విచ్చల విడిగా మాదకద్రవ్యాలైన గంజాయి, డ్రగ్స్ కూటమి ప్రభుత్వంలో రాజ్యమేలుతున్నాయని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి అన్నారు. గతంలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం బెల్టుషాపులను నియంత్రణ చేసిందన్నారు. ఎక్కడా గంజాయి లేకుండా నిఘా పెంచినా చంద్రబాబునాయుడు, లోకేష్ నాడు రాష్ట్రంలో విచ్చల విడిగా గంజాయి సాగుచేస్తున్నారంటూ అసత్య ప్రచారం చేశారన్నారు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కుమారుడే డ్రగ్స్ తీసుకుని పట్టుబడ్డాడని చెప్పారు. రాష్ట్రంలో పాలన పూర్తిగా గాడి తప్పడంతోపాటు మద్యం, బెల్టుషాపుల ద్వారా యువత మద్యానికి, గంజాయి, డ్రగ్స్‌కు బానిసలైపోతున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గిరిధర్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి కొమెర్ల మోహన్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ సింగరయ్య, విష్ణువర్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి


