విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు
ప్రొద్దుటూరు కల్చరల్ : విద్యార్థులకు విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు లభిస్తుందని శ్రీ పుష్పాండజ మహర్షి ఆశ్రమ పీఠాధిపతి, దివ్యజ్ఞానానంద గిరిస్వామి పేర్కొన్నారు. స్థానిక తొగటవీర క్షత్రియ కళ్యాణ మండపంలో ఆదివారం శ్రీమత్ పెద్ద అహోబిళక్షేత్ర తోగటవీర క్షత్రియ సేవా సంఘం వారి అన్నసత్రం ఆధ్వర్యంలో కడప, అనంతపురం, కర్నూలు ఉమ్మడి జిల్లాల్లో ప్రతిభ గల పేద తొగటవీర క్షత్రియ విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ విద్యార్థులు విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ బాగా చదువుకుని ఉన్నత స్థానాల్లో నిలవాలన్నారు. చదువుతో పాటు విజ్ఞానం, నైతిక విలువలు, సేవా గుణం అలవరచు కోవాలన్నారు. ప్రతిభ గల పేద విద్యార్థులకు పెద్ద మొత్తంలో ఉపకార వేతనాలు అందిస్తున్న పెద్ద అహోబిళక్షేత్ర తోగటవీర క్షత్రియ సేవా సంఘం వారి అన్నసత్రం కమిటీ వారిని అభినందించారు. అన్నసత్రం కమిటీ అధ్యక్షుడు పల్లా శేషయ్య మాట్లాడుతూ ప్రతిభ గల పేద తొగట కుల విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 5 ఏళ్లుగా దాతల సహకారంతో ఉపకార వేతనాలను అందిస్తున్నామన్నారు. దేవదాయశాఖ డిప్యూటీ కమిషనర్ పట్టెం గురుప్రసాద్, అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్‌ఆఫీసర్ అన్నం రఘునాథ్ మాట్లాడారు. అనంతరం 124 మంది ఇంజినీరింగ్ విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.15వేలు, ముగ్గురు ఎంబీబీఎస్ విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.50వేలు చొప్పున మొత్తం రూ.20.10 లక్షల రూపాయల చెక్కులను అందించారు. కార్యక్రమంలో శ్రీమత్ పెద్ద అహోబిళక్షేత్ర తోగటవీర క్షత్రియ సేవా సంఘం అన్నసత్రం ఉపాధ్యక్షుడు కంభం చిన్న పుల్లయ్య, నరసింహులు, కార్యదర్శి పల్లా శంకర్ నారాయణ, కోశాధికారి పల్లా నాగమయ్య, సలహాదారుడు చిమ్మని చౌడయ్య, కళ్యాణ మండపం అధ్యక్షుడు బండారు సూర్యనారాయణ, వృత్తినిపుణుల అధ్యక్షుడు కుండా నాగరాజు, తొగట కుల పెద్దలు, ప్రముఖులు పాల్గొన్నారు.
వెనిజులా నుంచి అమెరికా సైన్యాలు వెనక్కి వెళ్లాలి
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : వెనిజులా నుంచి అమెరికా సైన్యాలు వెనక్కి వెళ్లాలని సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు జి.చంద్ర, చంద్ర శేఖర్ సీపీఐ (ఎం.ఎల్) లిబరేషన్ జిల్లా కార్యదర్శి ఓబయ్య, ఆర్.ఎస్.పి జిల్లా కార్యదర్శి సుబ్బరాయుడు పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని సీపీఎం కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఐక్యరాజ్యసమితి నియమాలను, అంతర్జాతీయ న్యాయ సూత్రాలను ఉల్లంఘించి, వెనిజులా దేశంలోని చమురు సంపదను, నిక్షేపాలను కొల్లగొట్టేందుకు అమెరికా ఈ దాడులకు పాల్పడటం తగదన్నారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎల్.నాగ సుబ్బారెడ్డి, వెంకట శివ, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ.రామ్మోహన్, వి.అన్వేష్ తదితరులు పాల్గొన్నారు.
● దివ్యజ్ఞానానంద గిరిస్వామి
● 127 మంది విద్యార్థులకు రూ.20.10 లక్షలు
ఉపకార వేతనాలు పంపిణీ


