తెలంగాణ సీఎం ప్రకటనపై చంద్రబాబు స్పందించాలి
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలుపుదలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన నిజమైతే చంద్రబాబు రాయలసీమ ద్రోహిగా మిగిలిపోతారని సీపీఐ జిల్లా కార్యదర్శి జి.చంద్ర పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని సీపీఐ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గతంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడి్‌డ్ ప్రభుత్వం రాయలసీమ జిల్లాల శాశ్వత కరువు నివారణ చర్యల్లో భాగంగా రూ. 6829.15 కోట్ల అంచనా వ్యయంతో రాయలసీమ ఎత్తిపోతల పథకం, శ్రీశైలం కుడి ప్రధాన కాలువ వెడల్పు సామర్థ్యం పెంపు పనులకు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. శ్రీశైలం జలాశయం వెనుక భాగంలో సంగమేశ్వర నుంచి రోజుకు మూడు టీఎంసీలు చొప్పున ఎత్తిపోతల పథకం ద్వారా పోతిరెడ్డిపాడు దిగువన నాలుగు కిలోమీటర్ల వద్ద శ్రీశైలం కుడి ప్రధాన కాలువలో కలిపేందుకు చేపట్టిన పనికి రూ.3825 కోట్లు కేటాయించారన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద నుండి బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వరకు కాలువ సామర్థ్యాన్ని 80వేల క్యూసెక్కులకు పెంచుతూ రూ. 570.45 కోట్లు ఖర్చు చేశారన్నారు. శ్రీశైలం కుడి కాలువ (ఎస్.ఆర్.బి.సి), గాలేరు నగరి సుజల స్రవంతి ట్రైనింగ్: బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వద్దనుండి గోరకల్లు రిజర్వాయర్ వరకూ ఎస్.ఆర్.బి.సి, జిఎన్‌ఎస్‌ఎస్ లైనింగ్ పనులు మరియు జిఎన్‌ఎస్‌ఎస్ కాలువ సామర్థ్యం 30వేల క్యూసెక్కులకు పెంచుతూ రూ.929.65 కోట్లు కేటాయించారన్నారు. గోరకల్లు అదనపు ఇన్ఫాల్ (రియర్వాయర్లో పలికి నీళ్ళు వచ్చే గేట్లు) రెగ్యులేటర్ నిర్మాణంకోసం రూ.36.95 కోట్లు గాలేరు–నగరి, ఎస్.ఆర్.బి.సి కాలువల ఆధునీకరణకు గోరకల్లు రిజర్వాయర్ నుండి ఔకు రిజర్వాయర్ వరకు రూ.1415 కోట్లు కేటాయించారన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ఎత్తిపోతల పథకం, సామర్థ్యం పెంపు పథకాలపై విడుదల చేసిన జి.ఓ నెం. 203 పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమానాలు, అపోహలతో అభ్యంతరాలను తెలుపుతూ కృష్ణానది యాజమా న్య బోర్డు చైర్మెన్ చంద్రశేఖర్ అయ్యర్‌కు తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రంజిత్ కుమార్, ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ ఫిర్యాదు చేశారన్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పై వత్తిడి తెచ్చి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలుపుదల చేయించినట్లు అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన రాయలసీమ ప్రజానీకానికి ఆందోళన కలిగించే అంశం అన్నారు. నిజంగా అలాంటి లోపాయికారి ఒప్పందం జరిగి ఉంటే చంద్రబాబు నాయుడు రాయలసీమ ద్రోహిగా మిగిలిపోతారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ప్రకటనపై చంద్రబాబు తక్షణ స్పందించాలని, రాయలసీమ ఎత్తిపోతల పథకంపై స్పష్టమైన ప్రకటన విడుదల చేయాల డిమాండ్ చేశారు.
సీపీఐ జిల్లా కార్యదర్శి జి.చంద్ర


