ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నం
గోపవరం : నెల్లూరు – ముంబై (ఎన్‌హెచ్–67) జాతీయ రహదారి పక్కనే గోపవరం రెవెన్యూ పొలం సర్వే నంబర్ 68/1లో ఉన్న లక్షల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకు రెవెన్యూ అధికారులు సహకరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదే సర్వే నంబరు పక్కనే 169 సర్వే నంబరులో 4.28 ఎకరాలు చల్లా గిరిజమ్మకు పట్టాభూమి ఉంది. స్థానికేతరులైన గిరిజమ్మ భర్త రిటైర్డ్ ఉద్యోగి అయినప్పటికీ కోట్ల రూపాయలు విలువ చేసే 4.28 ఎకరాలు పట్టాభూమి ఉన్నా అప్పటి రెవెన్యూ అధికారులు 68/2 లో ఉన్న 45 సెంట్ల ప్రభుత్వ భూమికి డీకేటీ పట్టా ఇచ్చారు. ఒక ఉద్యోగికి డీకేటీ పట్టా ఇవ్వడంపై అప్పట్లోనే స్థానికులు తీవ్రస్థాయిలో వ్యతిరేకించారు. అయినప్పటికీ సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తమ పట్టా భూమితో పాటు సర్వేనెంబర్ 68/1 లో ఉన్న 49 సెంట్లు ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిని కూడా కలుపుకుని అప్పట్లో సిమెంటు దిమ్మెలతో ప్రహరీ నిర్మించారు. అయితే ఈ విషయంపై పత్రికల్లో వరుస కథనాలు రావడంతో గతంలో పనిచేసిన రెవెన్యూ అధికారులు 68/1 సర్వేనెంబరులో ఉన్న గోడను కూల్చివేశారు. ప్రస్తుతం తిరిగి ఆ భూమిలో ఉన్న కంపచెట్లను తొలగించి గోడ కట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. లక్షల రూపాయలు విలువ చేసే 68/1 సర్వేనెంబరులో ఉన్న 49 సెంట్ల ప్రభుత్వ భూమిని వదిలేసి గోడను ఏర్పాటు చేసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. 68/1 సర్వేనెంబరులో ఉన్న 49 సెంట్లలో అధికారులు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసి ప్రభుత్వ భూమిని కాపాడాల్సి ఉంది.
సహకరిస్తున్న రెవెన్యూ అధికారులు


