11 నుంచి పౌర హక్కుల సంఘం మహా సభలు
కడప కోటిరెడ్డిసర్కిల్ : ఈ నెల 10, 11న తిరుపతి నగరం బైరాగి పట్టెడలోని సీపీఐ కార్యాలయంలో నిర్వహించే పౌరహక్కుల సంఘం 20వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబు కోరారు. ఆదివారం కడప నగరంలోని వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో మహాసభలకు సంబంధించిన పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో వివిధ వర్గాలు, సమూహాలు తమ హక్కుల సాధన కోసం జరిగే ఉద్యమాలకు మద్దతు ఇస్తున్నామని చెప్పారు. నేడు ప్రజాస్వామ్య ఉనికికే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సహజ సంపదను కాపాడుతున్న ఆదివాసీలు, గిరిజనులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్‌కౌంటర్ పేరుతో హత్య చేస్తున్నాయన్నారు. ఈ సభల్లో మాజీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్, ప్రముఖ గాంధేయవాది హిమాంశు కుమార్, సామాజిక కార్యకర్త బేలబాటియా, ప్రొఫెసర్ హరగోపాల్ పాల్గొంటారని తెలిపారు. పౌర హక్కుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పి. రెడ్డెయ్య, న్యాయవాది సంపత్ కుమార్, పరిశ్రమల శాఖ మాజీ జాయింట్ డైరెక్టర్ జి.గోపాల్, పౌర హక్కుల సంఘం సభ్యులు రవిశంకర్, జగదీష్, జేవీవీ నాయకులు వెంకటేష్, అరుణ, మల్లెల భాస్కర్ పాల్గొన్నారు.


