క్రీడలతో మానసిక, శారీరక దృఢత్వం
● జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్
● జిల్లా వార్షిక పోలీస్ స్పోర్ట్స్ – గేమ్స్ మీట్ – 2025 ప్రారంభం
● ఉత్సాహంగా పాల్గొన్న
పోలీస్ అధికారులు, సిబ్బంది
కడప అర్బన్ : క్రీడలతో మానసిక, శారీరక దృఢత్వం పెంపొందుతుందని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పేర్కొన్నారు. శనివారం నగరంలోని పోలీస్ పరేడ్ మైదానంలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వార్షిక పోలీస్ స్పోర్ట్స్– గేమ్స్ మీట్ – 2025 ను జిల్లా ఎస్పీ ప్రారంభించారు. ప్రారంభ సూచకంగా బెలూన్లు, కపోతాలను ఎగురవేశారు. జిల్లాకు చెందిన జాతీయ స్థాయి హాకీ క్రీడాకారులు, ఎ.ఆర్ హెడ్ కానిస్టేబుళ్లు ఎం.ఎస్ విజయభాస్కర్, విజయ్ కుమార్, ఫుట్ బాల్ క్రీడాకారుడు జి.రాజశేఖర్ జిల్లా ఎస్పీకి క్రీడా జ్యోతిని అందించారు. ఎస్పీ క్రీడాజ్యోతిని వెలిగించి స్పోర్ట్స్ – గేమ్స్ మీట్‌ను ప్రారంభించారు. ముందుగా పోటీల్లో పాల్గొనే సబ్ డివిజన్‌లకు చెందిన పోలీసు క్రీడాకారుల మార్చ్ ఫాస్ట్ ను జిల్లా ఎస్పీ తిలకించి గౌరవ వందనాన్ని స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ సిబ్బందిలో క్రీడా ప్రతిభను వెలికితీయడానికి ‘పోలీస్ స్పోర్ట్స్ మీట్’ ఎంతో దోహదపడుతుందన్నారు. క్రీడా స్ఫూర్తితో ఆటల్లో పాల్గొనాలని, గెలుపోటములు ముఖ్యం కాదని తెలిపారు. నిరంతరం విధి నిర్వహణలో ఉండే పోలీస్ సిబ్బందికి ఈ క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు వారిలో ఉన్న క్రీడాప్రతిభకు గుర్తింపు వస్తుందన్నారు. క్రమశిక్షణ, పోలీస్ సిబ్బంది మధ్య మరింత సమన్వయం పెంపొందేందుకు ఈ క్రీడలు దోహదపడతాయన్నారు. ఈ నెల 3, 4, 5 తేదీలలో వరుసగా మూడు రోజుల పాటు సాగే ఈ స్పోర్ట్స్ మీట్ లో 6 పోలీస్ సబ్ డివిజన్లకు సంబంధించిన టీమ్‌లు (కడప, మైదుకూరు, పులివెందుల, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, డి.ఎ.ఆర్) కబడ్డీ, వాలీబాల్, ఫుట్‌బాల్, అథ్లెటిక్స్, 100 మీటర్లు, 400 మీటర్లు, 800 మీటర్ల పరుగుపందెం, హైజంప్, లాంగ్ జంప్, క్రికెట్, షటిల్ మొదలగు క్రీడలలో పాల్గొంటారని పేర్కొన్నారు. లీగ్ మ్యాచ్‌లలో విజేతలుగా నిలిచిన వారు ఫైనల్స్ లో తలపడనున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్). కె.ప్రకాష్ బాబు, ఎ.ఆర్ అదనపు ఎస్.పి బి.రమణయ్య, డీఎస్పీలు ఎన్.సుధాకర్, ఎ.వెంకటేశ్వర్లు, పి. భావన, కె.వెంకటేశ్వర రావు, జి. రాజేంద్ర ప్రసాద్, బి.మురళి, ఆర్.ఐ లు శివరాముడు, శ్రీశైల రెడ్డి, టైటస్, సోమశేఖర్ నాయక్, నగరంలోని సీఐలు, ఎస్.ఐ లు, ఆర్‌ఎస్‌ఐ లు, పోలీస్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దూలం సురేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉప్పు శంకర్, పోలీసు సిబ్బంది, పిఈటీ మాస్టర్లు పాల్గొన్నారు.
పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో పాల్గొన్న క్రీడాకారులు
పోలీస్ స్పోర్ట్స్ మీట్ –2025లో మాట్లాడుతున్న జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్
క్రీడలతో మానసిక, శారీరక దృఢత్వం


