చికెన్‌వేస్ట్ టెండర్ కోసం టీడీపీలో కుమ్ములాట !
● వాయిదాపడిన టెండర్ల ఓపెనింగ్
● పురపాలికలో టీడీపీ వర్గనేతల హడావుడి
రాజంపేట : రాజంపేట పురపాలక సంఘంలో చికెన్‌వేస్ట్ టెండర్‌ను దక్కించుకునేందుకు అధికారపార్టీ టీడీపీలో కుమ్ములాట మొదలైంది. శనివారం టెండర్ల బాక్స్ కనపడలేదని టీడీపీలో మరో వర్గం వారు హడావుడి చేశారు. చికెన్‌వేస్ట్ టెండర్‌ను ఏకగ్రీవంగా దక్కించుకునేందుకు అధికారపార్టీలో మరో వర్గం ప్రయత్నిస్తుందనే అనుమానం ఆ పార్టీకి చెందిన మరోవర్గం నేతలకు కలిగింది. ఈ టెండర్ బాక్స్‌ను శనివారం మధ్యాహ్నం 3.30 గంటల తర్వాత తెరవాల్సి ఉంది, దానికోసం టీడీపీ కౌన్సిలర్లు పట్టుబట్టారు. అయితే కమిషనర్ లక్ష్మీనారాయణ అందుబాటులో లేకపోవడంతో వీరిలో అనుమానాలు బలపడ్డాయి. అయితే కమిషనర్ పురపాలిక కార్యకలాపాలకు సంబంధించి జిల్లా కలెక్టరేట్‌కు వెళ్లినట్లుగా సిబ్బంది వివరించారు. దీంతో టెండర్ బాక్స్ ఓపెన్ చేయకుండా సోమవారానికి వాయిదా వేశారు. ఇప్పటికే ఒకసారి ఈ టెండర్ వాయిదా పడింది. ఇందుకు కారణం అధికారపార్టీకి చెందిన ఒకరికే చికెన్‌వేస్ట్ టెండర్‌ను ఇప్పించేందుకు ఆ పార్టీ నియోజకవర్గనేత పావులు కదుపుతున్నారు. నామినేట్ కింద తన వర్గానికి చెందిన ఒకరికే చికెన్ వేస్ట్ టెండర్‌ను ఇప్పించాలని చేసిన ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. కమిషనర్‌పై అధికారపార్టీ నుంచి ఈ టెండర్ విషయంలో ఒత్తిడి వున్నట్లు టీడీపీ వర్గాలే పేర్కొంటున్నాయి. కాగా చికెన్‌వేస్ట్‌కు నెల్లూరులో పెద్దగా డిమాండ్ ఉంది. ఇప్పుడు ఆ వ్యాపారానికి సంబంధించి టెండర్ దక్కించుకుంటే లక్షల్లో లాభమొస్తుందని భావించి, పోటీపడుతున్నారు. పట్టణంలో చికెన్ దుకాణాల వద్ద పారేసిన వేస్ట్‌ను సేకరించి, ట్రాక్టర్ ద్వారా నెల్లూరు తదితర ప్రాంతాలకు తీసుకెళ్లి అమ్ముకుంటున్నారు. గతంలో కూడా చాలా తక్కువ చికెన్‌వేస్ట్ తీసుకొని వ్యాపారం చేసి లాభాలు ఆర్జించిన క్రమంలో ఇప్పుడు టీడీపీ నాయకులు దృష్టి సారించారు. దీంతో ఈ టెండర్‌ను దక్కించుకునేందుకు టీడీపీలోనే రెండు వర్గాలు పోటీపడుతున్నాయి. అయితే వైఎస్సార్‌సీపీకి చెందిన వారు కూడా చికెన్ వేస్ట్ టెండర్లకు దరఖాస్తులు దాఖాలు చేశారు. ఏది ఏమైనప్పటికి చికెన్ వేస్ట్ కోసం టీడీపీలో రెండు వర్గాల కుమ్మలాటలు చూసి జనం విస్తుపోతున్నారు.


