ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి పోలీసులకు క్షమాపణ చెప్పాలి
– వైఎస్సార్‌సీపీ పంచాయతీరాజ్ విభాగం
రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి
పులివెందుల : అనంతపురం జెడ్పీ సర్వసభ్య సమావేశం జరుగుతున్న సమయంలో జెడ్పీలో ప్రజా ప్రతినిధులు ఉన్నారని వారికి రక్షణగా ఉన్న పోలీసుల మీద దౌర్జన్యంగా వ్యవహరించిన టీడీపీ నాయకుల మీద కేసులు నమోదు చేయాలని, రాష్ట్రంలో పోలీసులకే గౌరవం, రక్షణ లేని వ్యవస్థ నడుస్తోందని వైఎస్సార్‌సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రా రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఎదుట ఆయన వర్గీయులు పోలీసులను దుర్భాషలాడితే ఆయన వారికి వత్తాసు పలుకుతూ పోలీసుల మీద రౌడీయిజంగా మాట్లాడడం దేనికి సంకేతమన్నారు. పోలీసుల పట్ల దౌర్జన్యంగా వ్యవహరించి దుర్భాషలాడిన వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, అలాగే పోలీసులకు ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
నగల బ్యాగు మహిళకు అప్పగింత
కడప అర్బన్ : ఓ మహిళ ఆటోలో మరిచిపోయిన బంగారు, వెండి నగల బ్యాగును కొద్ది గంటల వ్యవధిలోనే బాధితురాలికి పోలీసులు అప్పగించారు. వివరాలు ఇలా.. కడప నగరం ప్రకాష్ నగర్‌కు చెందిన కొమ్మునూరి మానస అనే మహిళ బద్వేలుకు వెళ్లింది. అక్కడి నుంచి ఈనెల 2 వ తేదీ రాత్రి సుమారు 07.30 గంటలకు కడపకు వచ్చింది. కడప బస్టాండ్ వద్ద ఆటో తీసుకొని తన లగేజ్ బ్యాగులు, ఇద్దరు పిల్లలతో పాటు ఇంటికి వెళ్లింది. తర్వాత తన హ్యాండ్ బ్యాగ్ చూసుకోగా కనపడలేదని, చిన్నచౌక్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వెంటనే చిన్నచౌక్ పోలీసులు స్పందించి సీసీ కెమెరాలు చెక్ చేసి ఆటోను గుర్తించి ఆటో డ్రైవర్ బీకేఎం స్ట్రీట్‌కు చెందిన షేక్ ఖాజామొహిద్దిన్‌ను స్టేషన్‌కు పిలిపించారు. అప్పటికీ ఆటోలో వెనుక వైపు చూడకుండా అలాగే ఉండిన హ్యాండ్ బ్యాగ్ ను స్వాధీనం చేసుకున్నారు. అందులో ఉన్న సుమారు 50 గ్రాముల బరువు గల బంగారు వస్తువులు, సుమారు 100 గ్రాముల బరువు గల వెండి వస్తువులను గుర్తించారు. వాటి విలువ సుమారు రూ.4 లక్షలు ఉంటుంది, చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ సీఐ ఎ. ఓబులేసు, ఎస్‌ఐలు రాజరాజేశ్వర రెడ్డి, రవికుమార్‌లు బాధితురాలికి బ్యాగు, నగలు అప్పగించారు. ఆటోడ్రైవర్ ఖాజా మొహిద్దీన్‌ను ప్రశంసించారు. అతని నిజాయితీని గుర్తించి రూ.500 ప్రోత్సాహకం అందజేశారు.
ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి పోలీసులకు క్షమాపణ చెప్పాలి


