మళ్లీ మొదలైన కేబుల్‌వైర్ల చోరీ
లింగాల : లింగాల మండలంలో విద్యుత్ మోటార్ల వద్ద కేబుల్ వైర్లు చోరీ మళ్లీ మొదలైంది. శుక్రవారం రాత్రి గుర్తు తెలియని దొంగలు రామట్లపల్లె, చిన్నకుడాల గ్రామాలకు చెందిన రైతుల పొలాల్లోని విద్యుత్ మోటార్ల వద్ద ఉన్న విద్యుత్ కేబుల్ వైర్లను కత్తిరించుకుని వెళ్లారు. ఆయా గ్రామాలకు చెందిన సుమారు 20మోటార్లకు ఉన్న కేబుల్ వైర్లను అపహరించుకెళ్లారని రైతులు ఆందోళన చెందుతున్నారు. శనివారం ఉదయాన్నే రైతులు పొలాలకు వెళ్లి మోటార్లు ఆన్ చేయాలని చూస్తే కేబుల్ వైర్లు లేకపోవడం చూసి అవాక్కయ్యారు. రామట్లపల్లె గ్రామానికి చెందిన ఈశ్వరరెడ్డి, విశ్వనాథరెడ్డి, శంకర్‌రెడ్డి, సుబ్బరాయుడు, జయరామిరెడ్డి అనే రైతుల కేబుల్ వైర్లు చోరీ అయినట్లు తెలిపారు. ఒక్కో మోటార్ వద్ద 20 మీటర్ల నుంచి 30 మీటర్ల కేబుల్ వైర్లు చోరీకి గురయ్యాయని రైతులు వాపోయారు. ఈ మోటార్లకు సంబంధించిన కేబుల్ వైర్లను కొనుగోలు చేసి అమర్చుకోవాలంటే సుమారు రూ.10వేలు ఖర్చు చేయాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత అక్టోబర్, నవంబర్ మాసాలలో కోమన్నూతల, అంబకపల్లె, మురారిచింతల తదితర గ్రామాల్లోని కేబుల్ వైర్లు చోరీకి గురయ్యాయి. నవంబర్ 8వ తేదీన ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి రైతుల పక్షాన లింగాల పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. అప్పటి నుంచి స్తబ్దుగా ఉన్న దొంగలు తిరిగి చెలరేగిపోతున్నారు. ఇప్పటికై నా పోలీసులు రాత్రి పూట గస్తీని పెంచి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.


