దుంపలగట్టు పోస్ట్‌ ఆఫీసులో మొదలైన విచారణ | - | Sakshi
Sakshi News home page

దుంపలగట్టు పోస్ట్‌ ఆఫీసులో మొదలైన విచారణ

Jan 3 2026 7:07 AM | Updated on Jan 3 2026 7:07 AM

దుంపలగట్టు పోస్ట్‌ ఆఫీసులో మొదలైన విచారణ

దుంపలగట్టు పోస్ట్‌ ఆఫీసులో మొదలైన విచారణ

రూ.18 లక్షలకు పైగానే స్వాహా

వారంలోగా పూర్తి నివేదిక

ఖాజీపేట : దుంపలగట్టు పోస్ట్‌ ఆఫీసులో జరిగిన అక్రమాలపై ఒక్కో విషయం బయటకు వస్తోంది. హెడ్‌పోస్ట్‌ ఆఫీస్‌ అధికారులు విచారణ మొదలు పెట్టడంతో సిబ్బంది బాగోతం బయట పడుతోంది. ఈ విచారణలో ఇప్పటికే సుమారు రూ. 18 లక్షలకు పైగానే సిబ్బంది చేతివాటం చూపినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మరో వారం రోజుల్లో విచారణ పూర్తి అనంతరం పూర్తి నివేదిక బయటకు రానుంది. వివరాల్లోకి వెళితే...

ఖాజీపేట మండలం దుంపలగట్టు పోస్ట్‌ ఆఫీసు లో శ్రీనివాసులు అనే వ్యక్తి సుమారు 26 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. అయితే ఆయన అనధికారింగా తన కుమారుడు విజయ్‌ కుమార్‌ ను తన స్థానంలో నియమించుకున్నారు. సుమారు 10 సంవత్సరాలకు పైగానే అనధికారికంగా దుంలపగట్టు పోస్ట్‌ ఆఫీసులో విజయ్‌కుమార్‌ పనిచేస్తున్నాడు. ఇలా అందరి తో నమ్మకంగా ఉంటూనే తన చేతివాటం ప్రదర్శించారు. పోస్ట్‌ ఆఫీసు అధికారులతో సంబంధం లేకుండానే ప్రజల వద్ద నుంచి పొదుపు పేరుతో వసూళ్లు చేశారు. ఇదే విషయం పై స్థానిక ప్రజలు గుర్తించి పోలీసులకు, పోస్ట్‌ఆఫీసు అధికారులకు ఫిర్యాదు చేయడం తో తీగలాగితే డొంక కదిలిందన్న చందంగా మొత్తం వ్యవహారం బయటకు వస్తోంది.

అక్రమ వసూళ్లు రూ. 18 లక్షలకు పైనే ?

విజయ్‌కుమార్‌ అక్రమాల పై హెడ్‌ పోస్ట్‌ ఆఫీసు నుంచి అధికారులు ప్రత్యేక విచారణ అధికారులను నియమించారు. వారు రెండు రోజులుగా గ్రామంలో విచారణ చేపట్టారు. ఇందులో పోస్ట్‌ ఆఫీస్‌తో సంబంధం లేకుండానే సుమారు రూ. 5 లక్షలు వసూలు చేసినట్లు గుర్తించారు. కనీసం పాసుపుస్తకాలు గానీ అకౌంట్‌ కూడా లేకుండానే ఈ మొత్తం వసూలు చేసినట్లు గుర్తించారు. అలాగే పాసుపుస్తకాలను సైతం అధికారులు అందరి వద్ద నుంచి తీసుకుని పరిశీలన చేపట్టారు. ఈ పుస్తకాల్లో సైతం వసూలు చేసిన మొత్తం డబ్బు పోస్ట్‌ ఆఫీసులో చెల్లించకుండా స్వాహా చేసినట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా పాసుపుస్తకం లో సంతకాలు, సీల్‌ వేయడం కూడా పోస్ట్‌ ఆఫీసు అధికారి తో సంబంధం లేకుండానే జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఆర్డీ డబ్బులు కూడా గోల్‌ మాల్‌ జరిగినట్లు తెలుస్తోంది. దీని పై పోస్ట్‌ఆఫీసు పరిధిలో ఎన్ని ఖాతాలు ఉన్నాయి. అందులో ఎంత డబ్బు కట్టారు. ఎంత కట్టకుండా స్వాహా చేశారు. ఎంత డబ్బు స్వాహా అయ్యింది.. అన్న విషయాలను పూర్తిగా విచారణ చేస్తున్నారు. మరో వారం రోజుల్లో విచారణ పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. తదుపరి నివేదికను ఉన్నతాధికారులకు, పోలీసులకు అందించే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. అయితే అక్రమ వసూళ్లు రూ. 18 లక్షలకు పైగానే ఉండవచ్చని సమాచారం.

పై అధికారులు ఏం చేస్తున్నారు..?

దుంపలగట్టు పోస్ట్‌ ఆఫీసులో గడచిన 10సంవత్సరాలు గా తన తండ్రి శ్రీనివాసుల స్థానంలో విజయ్‌ కుమార్‌ పనిచేస్తుంటే ఉన్నతాధికారులు దీనికి వత్తాసు పలకడం విశేషం. పోస్ట్‌ ఆఫీసు లావాదేవీలు అన్ని మొత్తం తన కుమారుడు చేత చేయిస్తుంటే అధికారులకు తెలిసీ ఎలాంటి చర్యలు తీసుకోక పోవడం ఏమిటని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పుస్తకాల్లో సంతకాలు, లావాదేవీలు అన్నీ అంత ధైర్యంగా ఎలా చేశారని అందరూ ఆశ్చర్యపోతున్నారు. హెడ్‌పోస్ట్‌ఆఫీసులోని అధికారులకు తెలిసే జరిగిందా.. లేక దౌలతాపురం పోస్ట్‌ ఆఫీసులో అందరికీ తెలిసి జరిగిందా అన్నది విచారణలో తేలాల్సి ఉంది. అయితే స్థానికంగా చాలా మంది తన తండ్రి స్థానంలో అతనే అధికారిగా వచ్చారని భావించి డబ్బులు కడుతున్నట్లు స్థానికులు భావించారు. అయితే చివరకు శ్రీనివాసులు మాత్రమే అధికారి అని అతని కుమారుడు విజయ్‌కుమార్‌ అసలు ఉద్యోగి కాదని తెలియడంతో అంతా ఆశ్చర్య పోయారు.

డబ్బులు కడతాం వదిలేయండి..

అక్రమాలకు పాల్పడిన డబ్బును పూర్తిగా కడతాం.. కేసులు లేకుండా వదిలేయాలని పోస్ట్‌ఆఫీసు అధికారులకు శ్రీనివాసులు కుటుంబ సభ్యులు విన్నవించుకున్నట్లు సమాచారం. విచారణకు వచ్చిన అధికారులతో, అలాగే స్థానిక పొదుపు సభ్యలను సైతం ఉద్యోగిగా ఉన్న శ్రీనివాసులు విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అధికారులు ఎలా స్పందిస్తారో విచారణ పూర్తి అయితే గానీ అసలు విషయం బయట పడే అవకాశం లేదని స్థానికులు, అధికారులు అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement