నాకు న్యాయం చేయండి
● నా భర్తను హత్య చేసి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించారు
● డీఎస్పీ కార్యాలయం వద్ద
మృతుని భార్య ఆరోపణ
కడప అర్బన్ : వైఎస్‌ఆర్ కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలం గుర్రం గుంపు తండాకు చెందిన మహేంద్ర నాయక్ (29) అనే వ్యక్తి గత ఏడాది డిసెంబర్ 31వ తేదీన రాత్రి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు కడప రైల్వే పోలీసులు ఓ మృతదేహాన్ని రిమ్స్ మార్చురీకి తరలించారు. మొదట గుర్తుతెలియని మృతదేహంగా రైల్వే పోలీసులు తెలియజేశారు. మృతదేహంపై ఉన్న ఆనవాళ్లను బట్టి బంధువులు మృతి చెందిన వ్యక్తి మహేంద్ర నాయక్ గా గుర్తించారు. పోస్టుమార్టం నిర్వహణ అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ఈ క్రమంలో గుర్రం గుంపు తాండ లో నివాసముంటున్న మహేంద్ర నాయక్ కు అదే ప్రాంతానికి చెందిన సుధాకర్ నాయక్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మూడు నెలల క్రితం లక్ష రూపాయలు అప్పుగా ఇచ్చాడని, కొన్ని రోజులుగా తన డబ్బులు ఇవ్వాలని సుధాకర్ నాయక్ తన భర్తను వేధింపులకు గురి చేసేవాడని మృతుని భార్య సౌజన్య ఆరోపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సుధాకర్ నాయక్ చివరకు తన బంధువైన ఓ కానిస్టేబుల్ ద్వారా ప్రతిరోజు ఫోన్ చేయించి సతాయించేవాడన్నారు. తమకు న్యాయం చేయాలంటూ తమ బంధువులతో కలిసి బాధితురాలు సౌజన్య శుక్రవారం కడప నగరంలోని డీఎస్పీ కార్యాలయం వద్దకు వచ్చి ఆందోళన చేశారు. తన భర్త చావుకు సుధాకర్ నాయక్ కారణమని అతని డబ్బులు ఇవ్వలేదని మనసులో పెట్టుకొని కొంతమంది వ్యక్తులతో కలిసి తన భర్తను చంపేసి రైల్వే ట్రాక్ పై పడుకోబెట్టినట్లుగా తెలుస్తోందని ఆరోపించారు. మహేంద్రనాయక్ ఆటోను బాడుగకు తీసుకుని నడుపుకుంటూ తన భార్య సౌజన్య, కుమారులు భవేంద్రనాయక్ , కేదార్‌నాథ్ నాయక్ లతో జీవనం సాగించేవాడు. తన భర్త డిసెంబర్ 31వతేదీన తెల్లవారుజామున ఇంటినుంచి వెళ్లాడన్నారు. ఉదయం 9:30 గంటలకు, మధ్యాహ్నం 3:47కు ఫోన్ చేశాడన్నారు. తరువాత తాను రాత్రి పదేపదే ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదన్నారు. మరుసటి రోజున కడప రైల్వే పోలీసులు సమాచారం తెలియజేసేంతవరకు తన భర్త మరణించాడనీ తెలియలేదన్నారు. పోలీసులు సమగ్రంగా విచారించి తమకు న్యాయం చేయాలనీ మృతుని భార్య విజ్ఞప్తి చేశారు. సంఘటనపై సమగ్రంగా విచారిస్తున్నామని, సీసీటీవీ ఫుటేజీ, ఇతర సాంకేతిక పరిజ్ఞానంతో పూర్తి వివరాలు తెలుసుకుంటామని రైల్వే పోలీసులు తెలిపారు. మరోవైపు సంఘటన జరగక మునుపు మృతుడు మహేంద్ర నాయక్, తన భార్య, బంధువులతో గొడవ పడుతూ ఉన్న సమయంలో ఓ వ్యక్తి తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
మృతుడు మహేంద్ర నాయక్ (ఫైల్), డీఎస్పీ కార్యాలయం వద్ద మాట్లాడుతున్న సౌజన్య
నాకు న్యాయం చేయండి


