సచివాలయ ఉద్యోగులపై ఎమ్మెల్యే వరద చిర్రుబుర్రు
ప్రొద్దుటూరు రూరల్ : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలైనా ఇప్పటి వరకు నూతనంగా ఒక్క సామాజిక పింఛన్ మంజూరు చేయలేదు కదా కనీసం దరఖాస్తు చేసుకునేందుకు కూడా అవకాశం లేదు. దీంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి శుక్రవారం మండలంలోని సోములవారిపల్లె పంచాయతీ పెన్నానగర్‌లో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా రూ.5లక్షలతో నూతనంగా సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను ప్రజలు తమకు కొత్త పింఛన్లు రాలేదని చుట్టుముట్టారు. రేషన్ కార్డులు రాలేదని ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం నుంచి పింఛన్లు రాని సంగతి అటుంచితే సచివాలయ ఉద్యోగులు అందుబాటులో లేరని, ఎవరెవరికి పింఛన్లు, రేషన్ కార్డులు లేవో త్వరలో తనకు నివేదిక ఇవ్వాలని ఎమ్మెల్యే ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగులపై చిర్రుబుర్రులాడారు. నెల తర్వాత మళ్లీ వస్తానని ఇదేవిధంగా ఉద్యోగులు వ్యవహరిస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాననడం గమనార్హం. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సూర్యనారాయణరెడ్డి, మాజీ ఎంపీపీ రాఘవరెడ్డి, టీడీపీ నాయకుడు ఈవీ సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


