జాయింట్ ఎల్‌పీఎం సమస్యలను పరిష్కరించుకోండి
ప్రొద్దుటూరు రూరల్ : జాయింట్ ఎల్‌పీఎం సమస్యలను రైతులు పరిష్కరించుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు తెలిపారు. మండలంలోని కొత్తపల్లె గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం తొలి విడత రీ సర్వే పూర్తయిన సర్విరెడ్డిపల్లె రెవెన్యూ గ్రామ రైతులకు కొత్త పట్టాదారుపాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో తొలివిడతలో జరిగిన భూ రీ సర్వేలో ఒకే సర్వే నంబర్‌లో హక్కు కలిగిన రైతులు చిన్న చిన్న సమస్యలు, హద్దుల నిర్ధారణ, సర్వే నంబర్ సబ్ డివిజన్ వంటి కారణాలతో కొన్ని చోట్ల రీ సర్వే పూర్తికాక ఆ భూములు జాయింట్ ఎల్‌పీఎంలో ఉన్నాయన్నారు. అలాంటి రైతులు ఒకరికొకరు మాట్లాడుకుని రెవెన్యూ అధికారులకు సహకరించి తమ భూములకు సంబంధించి జాయింట్ ఎల్‌పీఎం సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రొద్దుటూరు మండలంలోని సర్విరెడ్డిపల్లె, దొరసానిపల్లె, ఎర్రగుంట్లపల్లె గ్రామాల్లో తొలి విడత కింద రీ సర్వే పూర్తవ్వడంతో కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలు మంజూరయ్యాయన్నారు. పాత పట్టాదారుపాస్‌పుస్తకాలను వెనక్కి తీసుకుని కొత్త పట్టదారుపాస్ పుస్తకాలను అందిస్తామన్నారు. రైతులతో సంబంధిత వీఆర్‌ఓలు బయోమెట్రిక్ వేయించుకుని కొత్త పట్టదారుపాస్ పుస్తకాలను ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ గంగయ్య, సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, రైతులు పాల్గొన్నారు.


