ఎల్లమ్మ గుడి భూమిపై వివాదం
మైదుకూరు : మైదుకూరు మండలం గంజికుంట వద్ద వెలసిన గ్రామ దేవత ఎల్లమ్మ గుడికి సంబంధించిన భూమిపై వివాదం తలెత్తడంతో శుక్రవారం పలు హిందూ సంఘాలు, బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున గుడి వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. వారు తెలిపిన మేరుకు వివరాలు ఇలా ఉన్నాయి. గంజికుంట వద్ద 200 సంవత్సరాలకు పూర్వం ఎల్లమ్మ గుడిని కట్టారు. ఎంతో మంది ఎల్లమ్మ దేవతను ఇలవేల్పుగా కొలుస్తూ పూజలు నిర్వహించేవారు. గుడి నిర్మించిన సర్వే నంబర్ 802లో 2.04 ఎకరాల భూమిని ఆలయ నిర్వాహకులు ఉత్సవాల సమయంలో వినియోగించడం చేసేవారు. అయితే కాలక్రమేనా గుడి నిర్వాహకులు ఉపాధి నిమిత్తం ఎక్కడెక్కడికో వెళ్లడంతో గుడికి ఆలనాపాలన కరువైంది. తిరిగి కొన్నాళ్లుగా ఎల్లమ్మ దేవతకు పూజలు నిర్వహించడం, జిల్లా నుంచే కాక, ఇతర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు రావడం జరుగుతోంది. అయితే కొన్నేళ్లుగా స్థానికులు కొందరు గుడి ఉన్న 2.04 ఎకరాల భూమిని ఆక్రమించి సాగు చేసుకుంటున్నారు. ఇటీవల గుడికి వస్తున్న భక్తులను ఆక్రమణదారులు అడ్డుకుంటూ ఇబ్బందులు పెడుతున్నారు. దానిపై కొందరు అధికారులకు ఫిర్యాదు చేయడంతో రెవెన్యూ వారు ప్రభుత్వ తోపుగా రికార్డుల్లో ఉన్న ఆ భూమిని ఎవరూ ఆక్రమించరాదని హెచ్చరిస్తూ బోర్డు పాతారు. కొద్ది రోజుల కిందట ఆక్రమణదారులు ఆ భూమిని సాగు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిసి శుక్రవారం హిందూ సంఘాలు, బీజేపీ నాయకులు గుడి వద్ద ఆందోళన చేశారు. సర్వే నంబర్ 802లోని 2.04 ఎకరాల భూమిని ఎల్లమ్మ గుడికి కేటాయించాలని డిమాండ్ చేశారు. సోమవారం గ్రీవెన్స్ సెల్ కార్యక్రమంలో అధికారులకు ఈ విషయమై నివేదిస్తామని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు మాచనూరు సుబ్బరాయుడు అన్నారు.
గుడి వద్ద హిందూ సంఘాల ఆందోళన


