కులాలు విస్మరించి ఐక్యత చాటాలి
పోరుమామిళ్ల : వేలాది సంవత్సరాల చరిత్ర కలిగిన హిందూ సమాజంలో కుల వివక్షకు స్థానం లేదని, 17 వ శతాబ్దంలో ఆంగ్లేయులు దేశంలో ప్రవేశించాకే విభేదాలు చోటు చేసుకున్నాయని స్వామి శివరామానందసరస్వతి, సూర్యనారాయణ(హైదరాబాద్), కిషోర్ (ధర్మవరం), శ్రీమతి భక్తవత్సల పేర్కొన్నారు. కులాల మధ్య విభేదాలు విస్మరించి హిందువులంతా ఐక్యంగా ఉండాలని అన్నారు. ఆదివారం పోరుమామిళ్ల పద్మావతి కల్యాణ మండపంలో జరిగిన హిందూ సమ్మేళన సభలో వారు మాట్లాడారు. కులం ఇంట్లోనే ఉండాలని, గడప దాటితే అందరం హిందువులమని, కులాల అడ్డుగోడలు ఉండకూడదన్నారు. హిందూ ధర్మ రక్షణ కోసం ఛత్రపతి శివాజీలాగా, వివేకానందుడిలాగా ధర్మపోరాటం చేయాలని కోరారు. అంతకు ముందు పట్టణ ఉత్తర శివారులోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం నుంచి పట్టణ దక్షణ శివారులోని పద్మావతి కల్యాణ మండపం వరకు ప్రదర్శన సాగింది. కళాకారులు కోలాటం చేస్తుండగా పలు పాఠశాలల విద్యార్థులు సీతారాములు, లక్ష్మణ, హనుమంత, శివుడు, భరతమాత, ఛత్రపతి, రాణిరుద్రమ, వివేకానందల వేషధారణలతో ఆకట్టుకున్నారు. ర్యాలీలో వివిధ గ్రామాల నుంచి వేలాదిమంది పాల్గొన్నారు. మహిళలు భారీ స్థాయిలో పాల్గొనడం పోరుమామిళ్ల చరిత్రలో ఇదే మొదటి సారి.
పోరుమామిళ్లలో హిందూ సమ్మేళనం
కులాలు విస్మరించి ఐక్యత చాటాలి


