మృత్యువులోనూ వీడని స్నేహ బంధం
దువ్వూరు : స్థానిక నల్లవంక దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్నేహితులు మృతి చెందారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని గోపులాపురం గ్రామానికి చెందిన చిట్టిబోయిన పెద్ద ఎల్లయ్య (60), నేలటూరు గ్రామానికి చెందిన చాగలేటి వీరప్రతాప్‌రెడ్డి (62) ఇద్దరు స్నేహితులు. ఆదివారం వీరిద్దరు దువ్వూరుకు ఇంటి సరుకుల కోసం టీవీఎస్ ఎక్సెల్ స్కూటర్‌పై వచ్చి తిరిగి సొంత ఊర్లకు బయలుదేరారు. దువ్వూరు సమీపంలోని నల్లవంక దగ్గర ఉన్న సురేష్ గోడౌన్ వద్ద వాహనాన్ని ఆపి రోడ్డు దాటుతుండగా ప్రొద్దుటూరుకు వెళుతున్న బొలెరో వాహనం వేగంగా వారిని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు స్నేహితులు అక్కడికక్కడే మృతి చెందారు. వీరిరువురు వ్యవసాయంపై ఆధారపడి జీవించేవారు. చాలా ఏళ్ల నుంచి ఇద్దరు స్నేహితులుగా ఉన్నారు. పెద్ద ఎల్లయ్యకు భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. వీరప్రతాప్‌రెడ్డికి కోవిడ్ సమయంలో భార్య చనిపోయింది. కుమారుడు, కుమార్తె ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో వీరు మృతి చెందిన విషయం తెలుసుకున్న బంధు మిత్రులు, ఇరుగ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో సంఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌చార్జి ఎస్‌ఐ శివప్రసాద్ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం


