సీపీ బ్రౌన్
నేడు సీపీ బ్రౌన్ జయంతి
తెలుగు భాషోద్ధారకుడు
కడప సెవెన్‌రోడ్స్: సీపీ బ్రౌన్...జిల్లా వాసులకు పరిచయం అక్కర్లేని పేరు. మరణశయ్యపై ఉన్న తెలుగు భాషా సాహిత్యాల సముద్ధరణకు జీవితాంతం అవిరళ కృషి చేసిన మహానుభావుడు. జీతంలో తన సొంత ఖర్చులు పోను మిగిలిన ప్రతి పైసా...జీవితంలో మిగిల్చగలిగిన ఒక్క క్షణం తీరిక సమయం వృథా కాకుండా తెలుగుభాషా సాహిత్యాలకు ఖర్చు చేశారు. సోమవారం బ్రౌన్ 227వ జయంతి సందర్భంగా ఆయన గురించి....
● కలకత్తాలో డేవిడ్ బ్రౌన్, ఫ్రాన్సెస్ కౌళె దంపతులకు 1798 నవంబరు 10వ తేది బ్రౌన్ జన్మించారు. తండ్రి మరణం తర్వాత ఆయన కుటుంబం ఇంగ్లాండ్ వెళ్లిపోయింది. సివిల్ సర్వీసుకు ఎంపికై న బ్రౌన్ 1817 ఆగస్టు 3వ తేది మద్రాసు చేరుకుని అదేనెల 13వ తేది అక్కడి కాలేజ్ ఆఫ్ పోర్ట్ సెయింట్ జార్జిలో చేరారు.
కడపలో ఉద్యోగ జీవితం ప్రారంభం
తెలుగు ప్రజల అదృష్టం కొద్దీ 1820 ఆగస్టులో కడప కలెక్టర్ హన్‌బరికి రెండవ అసిస్టెంట్‌గా బ్రౌన్‌కు పోస్టింగ్ ఇచ్చారు. ఉద్యోగ నియామక ఉత్తర్వు ఆగస్టు 19వ తేది కడపకు చేరింది. అలా ఆయన ఉద్యోగ జీవితం ఇక్కడే ప్రారంభం కావడం విశేషం. సివిల్‌సర్వీసు శిక్షణ సమయంలో మద్రాసు గవర్నర్ సర్ థామస్ మన్రో మాటల నుంచి ప్రేరణ పొందిన బ్రౌన్ రెండేళ్లలో తెలుగు చక్కగా నేర్చుకున్నారు. ఆ తర్వాత బదిలీపై వెళ్లిన బ్రౌన్ 1826 మార్చి 10వ తేది కడపజిల్లా కోర్టు రిజిస్ట్రార్‌గా మళ్లీ ఇక్కడికి వచ్చి 1829 ఫిబ్రవరి దాక అసిస్టెంట్ జడ్జి, జాయింట్ క్రిమినల్ జడ్జిగా పనిచేశారు.
భాషా సాహిత్యాల యజ్ఞం
ఆ సమయంలోనే కడప ఎర్రముక్కపల్లె వద్ద బంగళా, తోటను రూ. 3500కు కొన్నారు. ఎక్కడ చూసినా పేదరికం, అవిద్య, మూఢాచారాలు రాజ్యమేలుతుండేవి. సృజనాత్మకతతోపాటు సాహిత్య స్పృహ కూడా కొరవడిన తరుణమది. జాతిని ఉత్తేజ పరిచే సాహిత్య సృష్టికి తావు లేని కాలం. ఆ సమయంలో ఆయన భాషా సాహిత్యాల సముద్ధరణ యజ్ఞానికి సమాయత్తమయ్యారు. తన బంగళాలో కొంత భాగాన్ని పండిత మండలి నివాసం కోసం కేటాయించారు. సొంతంగా పండితులకు జీతాలు ఇచ్చి పోషించారు. తెలుగు తాళపత్ర గ్రంథాలు సేకరించి వాటిని కాగితాలపైకి ఎక్కించి శుద్ద ప్రతులు తయారు చేయించారు. వ్యాఖ్యానాలు, పీఠికలు రాయించి ముద్రణకు సిద్ధం చేయడం కడపలో బ్రౌన్ సాగించిన నిత్య వ్యవహారం. ఇంగ్లీషు–తెలుగు, తెలుగు–ఇంగ్లీషు నిఘంటువులు రాశారు. ఇంగ్లీషులో తెలుగు వ్యాకరణం రాసిన వారిలో బ్రౌన్ చాలా ముఖ్యులు.
కడపతో ప్రత్యేక అనుబంధం
కడప జిల్లాతో ఆయనకు ఉన్న అనుబంధం విడదీయలేనిది. కడపలో రెండు పాఠశాలలు ఏర్పాటు చేసి విద్యార్థులకు భోజన వసతితోపాటు ఉచితంగా తెలుగు, హిందూస్తానీ, పార్శీ భాషల్లో చదువు చెప్పించారు. ఆయన ఎక్కడ పనిచేస్తున్నా కడపతో సంబంధాలు కొనసాగించారు. మిగతా తెలుగు ప్రజలు గుర్తించుకోకపోయినా బ్రౌన్ నివసించిన బంగ్లా మొండిగోడలను సుందర తెలుగు సాహిత్య మహాసౌధంగా, భాషా పరిశోధన కేంద్రంగా నిర్మించి బ్రౌన్ కు సుస్థిర స్థానం కల్పించింది కడప వాసులే. ఇందులో డాక్టర్ జానమద్ది హనుమచ్ఛాస్త్రి కీలకపాత్ర పోషించారు.
సీపీ బ్రౌన్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సోమవారం బ్రౌన్ 227వ జయంతిని తొలిసారి అధికారికంగా నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటలకు కలెక్టరేట్ సభా భవనంలో నిర్వహించే కార్యక్రమానికి కలెక్టర్, జేసీతోపాటు ఇతర అధికారులు హాజరవుతారు. డాక్టర్ భూత పురి గోపాలకృష్ణ బ్రౌన్ సాహితీ సేవ అంశంపై, జీవీ సాయిప్రసాద్ బ్రౌన్ ఉద్యోగ ప్రస్థాన జీవితంపై ప్రసంగిస్తారు. అలాగే బ్రౌన్ గ్రంథాలయంలో ఉదయం 10.30 గంటలకు నిర్వహించనున్న బ్రౌన్ జయంతి కార్యక్రమానికి వైవీయూ వీసీ బెల్లకొండ రాజశేఖర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
బ్రౌన్‌కు కడపతో విడదీయరాని అనుబంధం
ఉద్యోగ జీవితం ప్రారంభం ఇక్కడే
భాషా సాహితీయజ్ఞం సాగించిందీ ఇక్కడే
నేడు 227వ జయంతి వేడుకలు
సీపీ బ్రౌన్
సీపీ బ్రౌన్


