నేడు శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు
కడప కోటిరెడ్డిసర్కిల్: ప్రముఖ శైవ క్షేత్రాలైన పొలతల, నిత్యపూజకోన, శ్రీశైలానికి సోమ వారం ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు కడప డిపో మేనేజర్ ఒక ప్రకటనలో తెలిపారు. నిత్యపూజకోనకు ఉదయం 6.30, 9.30, మధ్యా హ్నం 12.30, 3.30 గంటలకు బస్సులు బయలుదేరుతాయని పేర్కొన్నారు. పొలతలకు ఉదయం 6.30, 9.00, 11.30, మధ్యాహ్నం 2.15, 4.45 గంటలకు బస్సులు బయలుదేరుతాయన్నారు. ఈ బస్సులు పాత బస్టాండు నుంచి రాకపోకలు కొనసాగిస్తాయన్నారు. భక్తులు ఈ బస్సు సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: ఏపీ ఇంటర్ డిస్ట్రిక్ట్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్– 2025లో ఇద్దరు క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎంపికై నట్లు డీఎస్‌డీఓ గౌస్ బాషా పేర్కొన్నారు. ఇటీవల కాకినాడలో జరిగిన టోర్నమెంట్‌లో అండర్ 8–10 కేటగిరీల్లో కడపకు చెందిన ఆర్ సుచిత్ రెడ్డి రెండు గోల్డ్ మెడల్స్, అండర్ 6–8 కేటగిరీలో ఆర్ హార్థిక రెడ్డి రెండు గోల్డ్ మెడల్స్ సాధించి జాతీయ స్థాయికి ఎంపిక అయ్యారన్నారు. కోచ్‌లు విలియం కేరి, మహేష్ అభినందించారు. వీరు డిసెంబరు 5 నుంచి 15 వరకు విశాఖపట్నంలో జరిగే నేషనల్స్‌లో పాల్గొంటారని వెల్లడించారు.
కడప సెవెన్‌రోడ్స్: ప్రజా సమస్యల పరిష్కారానికి మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని డీఆర్వో విశ్వేశ్వరనాయుడు ఆదివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. అర్జీదారులు దాఖలు చేసిన తమ అర్జీలు పరిష్కారం కాకపోయినా లేదా తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నెంబర్‌కు కాల్ చేయవచ్చని పేర్కొన్నారు.
సభాభవన్‌లో పీజీఆర్‌ఎస్ నిర్వహణ
ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్)ను సోమవారం సభాభవన్‌లో నిర్వహిస్తున్నట్లు డీఆర్వో విశ్వేశ్వర నాయుడు తెలిపారు. అర్జీదారులు తమ ఫిర్యాదులను సమీపంలోని మండల కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాలలో కూడా సమర్పించవచ్చని వివరించారు.
9.30 నుంచి డయల్ యువర్ కలెక్టర్
డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని సోమ వారం ఉదయం 9.30 నుంచి 10 గంటల వరకు జరుగుతుందన్నారు.ప్రజలు 08562– 244437 ల్యాండ్ లైన్ నెంబరుకు ఫోన్ చేసి తమ సమస్యలను విన్నవించుకోవచ్చునని తెలిపారు.


