రేషన్‌ బియ్యం మాఫియాపై ఎస్పీ సీరియస్‌ | - | Sakshi
Sakshi News home page

రేషన్‌ బియ్యం మాఫియాపై ఎస్పీ సీరియస్‌

Nov 10 2025 7:44 AM | Updated on Nov 10 2025 7:44 AM

రేషన్‌ బియ్యం మాఫియాపై ఎస్పీ సీరియస్‌

రేషన్‌ బియ్యం మాఫియాపై ఎస్పీ సీరియస్‌

అక్రమార్కులను ఏరిపారేయాలని

పోలీసులకు ఆదేశాలు

రేషన్‌ బియ్యం వ్యాపారి కోసం

పోలీసుల గాలింపు

ప్రొద్దుటూరు క్రైం : రేషన్‌ బియ్యం మాఫియాపై జిల్లా ఎస్పీ నచికేతన్‌ విశ్వనాథ్‌ సీరియస్‌ అయ్యారు. ప్రొద్దుటూరులో రేషన్‌ మాఫియాను ఉక్కుపాదంతో అణచివేయాలని ఇక్కడి అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇక్కడి రేషన్‌ బియ్యం అక్రమార్కుల ఆగడాలు మితిమీరిపోవడంతో పోలీసు అధికారులు వారి అక్రమ వ్యాపారాన్ని కట్టడి చేయాలని భావిస్తున్నారు. శనివారం రాత్రి రేషన్‌ బియ్యం వాహనాన్ని పోలీసులు అడ్డుకోగా వాటిని తరలిస్తున్న అక్రమార్కుడు వాహనంతో ఉడాయించిన విషయం తెలిసిందే. ఒకానొక దశలో పోలీసులపైకి వాహనాన్ని ఎక్కించే ప్రయత్నం చేసినట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు. ఈ విషయాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకున్నట్లు తెలిసింది. ఇలానే వదిలేస్తే పోలీసులను కూడా లెక్కచేసే పరిస్థితి ఉండదని, సమాజంలో తమకు విలువ లేకుండా పోతుందని ఇక్కడి పోలీసు అఽధికారులు చెబుతున్నారు.

రేషన్‌ బియ్యం తరలింపుపై నిఘా..

రేషన్‌ బియ్యం తరలింపుపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ ప్రొద్దుటూరు పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఇప్పటికే అన్ని స్టేషన్‌ల పరిధిలో ఆయా సీఐలు కూడా పోలీసులను అప్రమత్తం చేశారు. అలాగే రేషన్‌ బియ్యం నిల్వ కేంద్రాలు, అక్రమార్కుల కదలికలపై నిఘా పెట్టాలని ఆదేశాలిచ్చారు. బియ్యం అక్రమ రవాణాలో ఎంతటి వారైనా ఉపేక్షించకూడదని ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. కాగా పట్టణంలోని కొందరు టీడీపీ నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని రెవెన్యూ, కొందరు పోలీసు అధికారుల అండతో ఈ రేషన్‌ బియ్యం దందా కొనసాగిస్తున్నారు. అడ్డు వచ్చిన పోలీసులను సైతం లెక్క చేయకుండా పట్టుబడిన వాహనాన్ని తీసుకెళ్లారంటే వారి ఽఽధైర్యం, తెగింపు ఏ పాటిదో తెలుస్తోంది.

పోలీసుల అదుపులో అక్రమార్కుడి తండ్రి

పోలీసులు ఉండగా రేషన్‌ బియ్యం వాహనాన్ని తీసుకెళ్లిన రేషన్‌బియ్యం వ్యాపారి తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆదివారం సాయంత్రం వరకు అతన్ని పోలీసులు విచారణ చేసినట్లు సమాచారం. అంతేగాక రేషన్‌ బియ్యం తీసుకెళ్లిన బొలెరో వాహనాన్ని వన్‌టౌన్‌ పోలీసులు సీజ్‌ చేశారు. డ్రైవర్‌తో పాటు ప్రధాన వాహనం తీసుకెళ్లిన బియ్యం వ్యాపారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా ఇతని కోసం పోలీసు అధికారులకు పెద్ద ఎత్తున ఫోన్లు వచ్చినట్లు సమాచారం. అయితే పోలీసులు మాత్రం ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ఈ వ్యవహారం పోలీసు ప్రతిష్టతో ముడిపడి ఉందని , అతన్ని వదిలే ప్రసక్తే లేదని, పట్టుకొని తీరుతామని చెబుతున్నారు. కాగా శనివారం రాత్రి రామేశ్వరం రోడ్డులో పట్టుబడిన రేషన్‌ బియ్యం వాహనం వద్ద గిడ్డంగివీధికి చెందిన ఒక ప్రధాన రేషన్‌ బియ్యం వ్యాపారితో పాటు మరి కొందరు కూడా ఉన్నట్లు పోలీసు అధికారులు గుర్తించారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement