25న దేశవ్యాప్త ఆందోళన
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : కార్మికుల మెడకు ఉరితాడైన నాలుగు లేబర్ కోడ్‌లు రద్దు చేయాలని, ఏ రంగంలో పనిచేసే కార్మికునికై నా కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, 8 గంటల పని విధానం అమలు చేయాలని కోరుతూ ఈ నెల 25న నిర్వహిస్తున్న దేశవ్యాప్త ఆందోళన జయప్రదం చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చలసాని వెంకటరామారావు కోరారు. ఆదివారం నగరంలోని విశ్వేశ్వరయ్య ఇంజినీరింగ్ కార్యాలయంలో ఏఐటీయూసీ జిల్లా జనరల్ బాడి సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కాంట్రాక్టు అవుట్ సోర్శింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం అమలు చేసి రెగ్యులరైజేషన్ చేయాలన్నారు. కేంద్రంలో ఉన్న 11 కార్మిక సంఘాలు ఉమ్మడిగా నవంబర్ 25 వ తేదీన దేశ వ్యాప్తంగా సమ్మె చేసి ఈ నాలుగు లేబర్ కోడ్‌లు రద్దు చేయించుకోవాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లికార్జున రెడ్డి, డిప్యూటీ జనరల్ సెక్రటరీ కేసీ బాదుల్లా ఉపాధ్యక్షులు మంజుల, శ్రీరాములు, చాంద్ బాషా, కార్యదర్శులు మద్దిలేటి, మస్తాన్, లింగన్న, ఏరియా కార్యదర్శి చంద్రశేఖర్ పాల్గొన్నారు.


