మృతులు కడప వాసులు
మైదుకూరు : మైదుకూరు – బద్వేలు రహదారిలోని కూడలికి సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. వీరు కడప నగరానికి చెందిన వారుగా గుర్తించారు. వివరాలు ఇలా ఉన్నాయి. కడప బెల్లంమండి వీధికి చెందిన సాయి సంజయ్ (23), చిన్న చౌక్ ప్రాంతంలోని అశోక్ నగర్‌కు చెందిన చింతల సంతోష్ (23 ) అనే యువకులు ఇంటర్ చదువుతున్నప్పటి నుండి స్నేహితులు. వీరు ఆదివారం స్కూటీలో వెళుతుండగా కూడలి వద్ద సమీపంలో నెల్లూరు – బళ్లారి జాతీయ రహదారి బైపాస్ ఫ్లైఓవర్ పై ప్రమాదం జరిగింది. సంఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటనకు కారణాలు తెలియ రాలేదు. మృతుల్లో సాయి సంజయ్ కడపలోని ఓ జ్యువెలరీ దుకాణంలో పనిచేస్తుండగా, సంతోష్ డిగ్రీ పూర్తి చేసినట్టు తెలుస్తోంది. సాయి సంజయ్ తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకు కాగా, సంతోష్ తల్లిదండ్రులకు ఇద్దరు కుమారులు. మృతుడు సంతోష్ పెద్దవాడు కాగా, డిగ్రీ చదువుతున్న జస్వంత్ రెండవ కొడుకు. వీరి తండ్రి రమేష్ మృతి చెందారు. తల్లి మహేశ్వరి నందలూరు ఆడపూర్‌లోని కస్తూర్బా పాఠశాలలో వాచ్‌మెన్ గా పనిచేస్తున్నారు. అర్బన్ ఎస్‌ఐ చిరంజీవి, సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మృతుల వివరాలను తెలుసుకున్నారు. అయితే వారు కడప నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చింది తెలియాల్సి ఉంది. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
సాయి సంజయ్, చింతల సంతోష్ (ఫైల్)
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం


