వైవీయూ రిజిస్ట్రార్‌పై చర్యలు తీసుకోవాలి
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : యోగి వేమన విశ్వవిద్యాలయంలో వేతన బిల్లుల చెల్లింపులో అవకతవకలకు పాల్పడిన ఇన్‌చార్జి రిజిస్ట్రార్ పి. పద్మపై చర్యలు తీసుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర డిమాండ్ చేశారు. ఆదివారం నగరంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విశ్వవిద్యాలయ బోధన, బోధనేతర సిబ్బంది అక్టోబర్ 2025 నెల వేతన బిల్లుగా 2 కోట్ల 94 లక్షల 82 వేల 153 రూపాయల మొత్తానికి అక్టోబర్ 25న రిజిస్ట్రార్ ఆచార్య పుత్తా ఆమోదం తెలిపినట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయన్నారు బోధన బోధనేతర సిబ్బంది ఖాతా వివరాలు అప్‌లోడ్ చేయకుండా, తన సొంత బ్యాంక్ ఖాతా నంబర్‌ను చేర్చారన్నారు. సీఎఫ్‌ఎంఎస్ వ్యవస్థ ప్రకారం ఒక అధికారి (మేకర్) వేతన వివరాలు అప్‌లోడ్ చేస్తే, మరొక అధికారి (చెకర్) వాటిని ధ్రువీకరించి ఆపై రిజిస్ట్రార్ ఆమోదించాలన్నారు. కానీ రిజిస్ట్రార్ ఒక్కరే మొత్తం ప్రక్రియను నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమన్నారు. కడప ట్రెజరీ కార్యాలయానికి చెందిన పవన్ కుమార్ నాగూరి బిల్లును సబ్ ట్రెజరీ అధికారికి పంపగా ఆయన ఉదయ శేఖర్ రెడ్డికి, అక్కడి నుంచి ఉప సంచాలకుడు వెంకటేశ్వర్లుకు పంపించారన్నారు. వారు అక్టోబర్ 27న ఆమోదించి ఎలాంటి అభ్యంతరాలు లేకుండా బిల్లును ఫైనాన్స్ శాఖకు పంపారన్నారు అనంతరం, ఆ శాఖ సరైన పరిశీలన చేయకుండానే బిల్లును చెల్లింపుల కోసం ఆర్‌బీఐకి పంపినట్లు సమాచా రం ఉందన్నారు. ఇది పలు స్థాయిలలో ఉన్న పర్యవేక్షణ లోపాన్ని స్పష్టంగా చూపిస్తోందన్నారు. ఆచార్య పుత్తా పద్మ గతంలో పరీక్షల నియంత్రణాధికారిగా ఉన్న సమయంలో కూడా విశ్వవిద్యాలయ పాత రికార్డులు, బుక్‌లెట్లు విక్రయించినట్టు ఆరోపణలు ఉన్నాయని, అప్పటి యూనివర్సిటీ యా జమాన్యం, ఉన్నతవిద్యాశాఖ ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. గతంలో జరిగిన అక్రమ నియామకాలపై విచారణ జరిపించాలని ఉన్నత విద్యాశాఖ నుంచి ఆదేశాలు వచ్చినా ఆయా లేఖలు అన్ని ఆమె వద్దనే భద్రంగా దాచుకున్నారన్నారు. విశ్వవిద్యాలయంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, అవకతవకలపై ఉన్నత విద్యాశాఖ విచారణ జరిపించాలని, ఆర్థిక నేరాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


