నగరేశ్వరునికి రుద్రాభిషేకం
ప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక వాసవీ సర్కిల్‌లోని శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి దేవి ఉద్యాన వనంలో ఆదివారం ఆరుద్ర నక్షత్రం సందర్భంగా నగరేశ్వరస్వామికి ఘనంగా రుద్రాభిషేకం నిర్వహించారు. నూతనంగా చరప్రతిష్ట చేసిన నగరేశ్వరస్వామి స్వరూప స్ఫటిక లింగానికి, పార్వతీ సమేత నగరేశ్వరస్వామి విగ్రహాలకు శ్రీ జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య మహా సంస్థానాధిపతి శ్రీ విద్యారణ్య భారతీ స్వామిజీ చేతుల మీదుగా ప్రత్యేక పూజాకార్యక్రమాలను జరిపారు. 102 మంది ఆర్యవైశ్య సుహాసినులు పార్వతీ మాతకు సామూహికంగా కుంకుమార్చనలు చేశారు. ఆర్యవైశ్య సభ అధ్యక్షుడు బుశెట్టి రామమోహన్ రావు, కార్యదర్శి మురికి నాగేశ్వరరావు, సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
ఉత్సాహంగా తైక్వాండో
చాంపియన్ షిప్ పోటీలు
ప్రొద్దుటూరు : జిల్లా తైక్వాండో సబ్ జూనియర్, కేడెట్, సీనియర్ కై రోగి, పూమ్సే చాంపియన్ షిప్ పోటీలు స్థానిక వైఎంఆర్ కాలనీలోని స్టేడియంలో ఈనెల 8, 9 తేదీలలో నిర్వహించారు. ఈ పోటీల్లో జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన సుమారు 200 మందికిపైగా క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ పోటీలను ఎస్‌ఐ వెంకటరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు విద్యతోపాటు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఓవరాల్ ఛాంపియన్ షిప్‌లో మొదటి స్థానం కోడూరు టీం, రెండో స్థానం ప్రొద్దుటూరు టీం, మూడో స్థానం పులివెందుల టీం సాధించినట్లు ఆర్గనైజింగ్ సెక్రటరీ కమాల్ తెలిపారు. విజేతలకు ఎస్‌ఐ ట్రోఫీలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్‌పీడీసీఎల్ బీసీ సంఘం అధ్యక్షుడు మురళీమోహన్, ప్రెసిడెంట్ మౌలా, ఖజాంచి శివాజీ, టెక్నికల్ ఇన్‌చార్జి సుధీర్ పాల్గొన్నారు.
నగరేశ్వరునికి రుద్రాభిషేకం


