
ఎమ్మెల్యే అండతోనే అసాంఘిక కార్యకలాపాలు
● పోలీసులను బ్లాక్‌మెయిల్ చేయడం ఎమ్మెల్యేకు అలవాటు
● వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి
రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి
ప్రొద్దుటూరు క్రైం : ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి, ఆయన కుమారుడు నంద్యాల కొండారెడ్డి అండతోనే ప్రొద్దుటూరులో క్రికెట్ బెట్టింగ్, మట్కా, గ్యాంబ్లింగ్, ఇతర జూదాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఆరోపించారు. దొరసానిపల్లెలోని తన నివాసంలో విలేకరులతో శనివారం ఆయన మాట్లాడుతూ పవిత్రమైన దేవాలయం లాంటి అసెంబ్లీలో ఇటీవల ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి అసత్యాలు మాట్లాడారన్నారు. లంచాలు తీసుకొని అసాంఘిక శక్తులకు కొందరు సహకరిస్తున్నారని మాట్లాడడం తగదన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నంత కాలం తన అండతో అసాంఘిక కార్యకలాపాలు జరిగాయని ఎమ్మెల్యే చెప్పడం హాస్యాస్పదమన్నారు. క్రికెట్ బెట్టింగ్, మట్కా, పేకాట జరగడానికి పోలీసులు కారణం కాదని అన్నారు. ఎమ్మెల్యేకు చిత్తశుద్ధి ఉంటే జూదమాడేవారిని గత ఎన్నికలకు ముందు టీడీపీలోకి ఆహ్వానించే వారు కాదని, ఎన్నికలప్పుడు వారితో పెద్ద ఎత్తున చందాలు తీసుకొని, ఇపుడు వారికి ఆదాయ వనరులు సమకూర్చేందుకు ఎర్ర తివాచీ పరచారన్నారు. ఎమ్మెల్యే అండతో మట్కా, క్రికెట్ బెట్టింగ్, జూదం నిర్వహించేదెవరో, వాళ్లందరికీ ఎవరు వడ్డీకి డబ్బులిస్తున్నారో, రేషన్ బియ్యం నల్లబజారులకు తరలిస్తున్నదెవరో, భూ ఆక్రమణ దారులెవరో తనకు తెలుసునని రాచమల్లు అన్నారు. ఎమ్మెల్యేకు ప్రొద్దుటూరు డీఎస్పీ సరిపోదనే కోపంతో ఆమెను అవినీతి పరురాలిగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. తాను చెప్పినట్లు వినే డీఎస్పీని తెచ్చుకొని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను వేధించాలనే కారణంతో బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని చెప్పారు. బ్లాక్ మెయిల్ అనేది వరదరాజులరెడ్డికి కొత్తేంకాదని 25 ఏళ్లుగా ఆయన ఇదే పని చేస్తున్నారని తెలిపారు. ఒక్కో బ్యాచ్‌కు 40–50 మందిని గోవా క్యాషినోకు తీసుకెళ్లి జూదాలు ఆడించే కౌన్సిలర్లు ఎవరో పోలీసులకు తెలుసునని రాచమల్లు అన్నారు.
కుమారుడిని అదుపులో పెడితే చాలు
తన కుమారుడు నంద్యాల కొండారెడ్డిని ఎమ్మెల్యే వరద అదుపులో పెట్టుకుంటే ప్రొద్దుటూరులో జూదం ఉండదని రాచమల్లు అన్నారు. పోలీసులు జూదరులను పట్టుకుంటే సీఐలు, ఎస్‌ఐలకు ఫోన్ చేసి కొండారెడ్డి వదలిపెట్టమని హుకుం జారీ చేస్తున్నాడని, వదలకుంటే అధికారుల పట్ల దుబారాగా మాట్లాడుతున్నాడని అన్నారు. ముందు టీడీపీలో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్నారు. పోలీసులకు ఎమ్మెల్యే ఆదేశాలిస్తే వారం రోజుల్లో మొత్తం కంట్రోల్ చేస్తారన్నారు. సమావేశంలో ఎంపీపీ శేఖర్‌యాదవ్, పార్టీ ప్రొద్దుటూరు, మార్తల ఓబుళరెడ్డి, బాణా కొండారెడ్డి, గజ్జలకళావతి, పిట్టాభద్రమ్మ తదితరులు పాల్గొన్నారు.