
కూటమిని నమ్మి మోసపోయాం !
కడప సెవెన్‌రోడ్స్ : కూటమి ప్రభుత్వాన్ని నమ్మి మోసపోయామంటూ సచివాలయ ఉద్యోగులు ఆవే దన వ్యక్తం చేశారు. జోరు వర్షంలో తడుస్తూ నిరసన గళం విప్పారు. సచివాలయాలలో పనిచేసే ఉద్యోగులు ఆలస్యంగానైనా కూటమి ప్రభుత్వం వ్యవరిస్తున్న తీరును ఎండగట్టారు. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం సాయంత్రం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. జేఏసీ పిలుపు మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్య సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పి.సిద్దేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఇంతకుముందు 50 ఇళ్లకు ఓ వలంటీర్ ఉండేవారని తెలిపారు. ఒక సచివాలయంలో 25 క్లస్టర్లు ఉంటాయన్నారు. వలంటీర్లు చేసి పని ఇప్పుడు తమపై పడుతోందన్నారు. డ్యూయల్ బాసిజం తమపై ఎక్కువైందని తెలిపారు. అన్నిరకాల పనులు సచివాలయ సిబ్బందితో చేయిస్తుండడం దారుణమన్నారు. అలాగే పదోన్నతులు కల్పించేందుకు తగిన విధి విధానాలు రూపొందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు హీరామియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.మస్తాన్ తదితరులు మాట్లాడుతూ ప్రతిసారి సర్వేల పేరుతో ఇంటింటికి తిరిగి విధులు నిర్వర్తించడం వల్ల క్షేత్రస్థాయిలో తీవ్ర అవమానాలకు గురవుతున్నామన్నారు. విద్యార్హత ఆధారంగా రాష్ట్ర అభివృద్ధి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా విధులను అప్పగించాలన్నారు. ఉద్యోగంలో ప్రమోషన్లు ఇవ్వాలని.. జీతాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘ ఇతర నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.