
కేజీబీవీ పిల్లలకు నాణ్యమైన ఆహారం అందించాలి
– కేజీబీవీల రాష్ట్ర డిప్యూటీ డైరెక్టర్ దేవరాజులు
కడప ఎడ్యుకేషన్ : కేజీబీవీల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని కేజీబీవీల రాష్ట్ర డిప్యూటి డైరెక్టర్ దేవరాజులు సూచించారు. కడపలోని యూటీఎఫ్ కార్యాలయంలో సోమవారం వంట మనుషులకు, వాచ్ ఉమెన్‌లకు, ఏఎన్‌ఎంలకు, అటెండర్లకు, స్వీపర్లకు అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా దేవరాజులు మాట్లాడుతూ కేజీబీవీ పిల్లలకు వడ్డించే ఆహారం నాణ్యతలో ఎక్కడా తేడా రాకూడదన్నారు. వంటమనుషులు అన్ని జాగ్రత్తలు పాటించి భోజనాలను వండాలన్నారు. అలాగే అటెండర్లు, స్వీపర్లు ఎప్పటికప్పుడు శుభ్రతను పాటించాలన్నారు. సమగ్రశిక్ష అడిషన్ కో–ఆర్డినేటర్ నిత్యానందరాజులు మాట్లాడారు. జీసీడీఓ దార్ల రూతు ఆరోగ్య మేరీ కేజీబీవీల సిబ్బంది విధి విధానాలను వివరించారు. అనంతరం ఉపాధ్యాయుడు దేవదత్తం డెమో చేసి వివరించారు. సెక్టోరియల్ అధికారలు సంజీవరెడ్డి, ఆఫీసు సిబ్బంది మాధవి, అనూష, కేజీబీవీ సిబ్బంది పాల్గొన్నారు.
నేడు విద్యుత్ బిల్లులు
చెల్లించవచ్చు
కడప కార్పొరేషన్ : జిల్లాలో విద్యుత్ వినియోగదారుల సౌకర్యార్థం ఈనెల 30వ తేది సెలవు దినం అయినప్పటికీ జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యుత్ బిల్లుల వసూలు కేంద్రాలు యథాతథంగా పనిచేస్తాయని ఏపీఎస్పీడీసీఎల్ పర్యవేక్షక ఇంజినీరు ఎస్. రమణ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని విద్యుత్ బిల్లులు సకాలంలో చెల్లించి సంస్థ పురోభివృద్ధికి సహకరించాలని కోరారు.
హుండీ ఆదాయం లెక్కింపు
సిద్దవటం : శ్రీ నిత్యపూజ స్వామి హుండీ ఆదాయం లెక్కించగా రూ.60,785 ఆదాయం వచ్చినట్లు దేవదాయశాఖ రాజంపేట ఇన్‌స్పెక్టర్ జనార్ధన్, ఆలయ కార్యనిర్వహణాధికారి ఏ.శ్రీధర్‌లు తెలిపారు. సోమవారం వారు మాట్లాడుతూ ఆగస్టు 13 నుంచి సెప్టెంబర్ 29వ తేదీ వరకు భక్తులు స్వామి వారి హుండీలో వేసిన కానుకలను గ్రామస్తుల సమక్షంలో లెక్కించినట్లు చెప్పారు. కార్యక్రమంలో అర్చకులు, ఆలయ సిబ్బంది చంద్ర, వంతాటిపల్లి గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ఓపెన్ స్కూల్ దరఖాస్తు గడువు పెంపు
మదనపల్లె సిటీ : ఓపెన్ స్కూల్ ద్వారా పదోతరగతి, ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశానికి గడువును అక్టోబర్ 31వతేదీ వరకు పెంచినట్లు ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ పఠాన్ మహమ్మద్‌ఖాన్ తెలిపారు. రూ.200 అపరాధ రుసుంతో అవకాశం కల్పించారన్నారు. 14 సంవత్సరాలు వయస్సు నిండిన వారు పదోతరగతిలో, అలాగే 10వ తరగతి పూర్తి చేసిన వారు ఇంటర్మీడియట్ లో ప్రవేశం పొందొచ్చన్నారు. వివరాలకు 8121 852786 నంబర్‌లో సంప్రదించాలన్నారు.