
వైఎస్సార్‌సీపీ నాయకులకు డిజిటల్ బుక్ శ్రీరామరక్ష
● ప్రభుత్వం ఏర్పడగానే అందరికీ న్యాయం చేస్తాం
● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
పి.రవీంద్రనాథ్‌రెడ్డి
కడప కార్పొరేషన్ : వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, సామాన్య ప్రజలకు డిజిటల్ బుక్ శ్రీరామ రక్షలా ఉపయోగపడుతుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. కడప వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో పార్లమెంటు పరిశీలకులు కొండూరు అజయ్‌రెడ్డి, బద్వేల్ ఎమ్మెల్యే దాసరి సుధ, మాజీ మేయర్ సురేష్‌బాబు, మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, ఇన్‌చార్జి మేయర్ ముంతాజ్ బేగంలతో కలిసి డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ పోస్టర్లను శనివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారన్నారు. కోర్టులు పదే పదే హెచ్చరిస్తున్నా పోలీసులు లెక్క చేయడం లేదన్నారు. కూటమి ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలను తెలుపుతూ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని వీడియోలు, ఫోటోలు అప్‌లోడ్ చేయొచ్చన్నారు. యాప్‌లో నమోదు చేయలేనివారు 040–49171718 నంబర్‌కు కాల్‌చేసి నమోదు చేయించుకోవచ్చన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడగానే వారికి న్యాయం చేస్తామన్నారు. దుర్మార్గాలకు పాల్పడిన వారిని తప్పకుండా చట్టం ముందు నిలబెడతామని వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నేతలు ఎస్.యానాదయ్య, పులిసునీల్‌కుమార్, రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, ఎస్.వెంకటేశ్వర్లు, పి.రామ్మోహన్‌రెడ్డి, షఫీ, దాసరిశివ, సింధేరవి, షేక్ షఫీ, ఫయాజ్ పాల్గొన్నారు.