
రాష్ట్రాన్ని అమ్మేసేందుకే కూటమి వచ్చింది
● 17 నెలల్లో ఒక్క ఇటుక కూడా పేర్చలేదు
● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
పి.రవీంద్రనాథ్‌రెడ్డి
కడప కార్పొరేషన్ : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని అమ్మేసేందుకే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. పార్టీ కార్యాలయంలో విలేకరులతో గురువారం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో అవినీతి విలయతాండవం చేస్తోందని, కిందిస్థాయి నుంచి ముఖ్యమంత్రి వరకూ దోచుకోవడం, దాచుకోవడం నిత్యకృత్యమైందన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుక్షణమే లక్షల టన్నుల ఇసుక డంప్ చేసి అమ్మేసుకున్నారని, మట్టి, మైన్స్, సిలికా.... ఇలా దేన్నీ వదలకుండా దోచుకుంటున్నారన్నారు. మద్యం విచ్చలవిడిగా ఏరులై పారిస్తున్నారని, బెల్టు షాపులు, పర్మిట్ రూములు పెట్టి సొమ్ముచేసుకుంటున్నారన్నారు. చైన్నె, బెంగళూరు, హైదరాబాద్‌ల నుంచి మద్యం అక్రమరవాణా అవుతోందని, దొంగసారా కూడా టీడీపీ నేతలే కాస్తున్నారన్నారు. ప్రజారోగ్యం పట్ల కాస్తయినా శ్రద్ధ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మట్కా కంపెనీలు, పేకాట క్లబ్బులు విపరీతంగా పుట్టుకొస్తున్నాయని, ఐదారు వేలకే మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్నారని మండిపడ్డారు. ఇదంతా పెద్ద స్కాం అని, టెండర్లు వేసిన వారు జైలుకు పోక తప్పదని హెచ్చరించారు. మెడికల్ కాలేజీల టెండర్ కండీషన్లు అధ్వాన్నంగా ఉన్నాయని, మల్టిపుల్ టెండర్లు రాకపోతే వాటిని రద్దు చేయాల్సి ఉండగా, సింగిల్ టెండర్ వచ్చినా ఆమోదిస్తున్నారన్నారు. చంద్రబాబు ఎప్పుడు అఽధికారంలోకి వచ్చినా ప్రభుత్వ సంస్థలను పప్పులు, బెల్లాలకు ప్రైవేటుకు అమ్మేస్తారని, ఇప్పుడూ అదే జరుగుతోందన్నారు. చంద్రబాబు హయాంలోనే షుగర్ ఫ్యాక్టరీలు, పాల ఫ్యాక్టరీలు, ఆల్విన్ ఫ్యాక్టరీ మూతబడ్డాయని గుర్తు చేశారు. రాష్ట్రంలో నిత్యావసర సరుకులు, పెట్రో ధరలు భగ్గుమంటున్నాయని, కరెంటు బిల్లు ముట్టుకుంటే షాక్ కొడుతోందన్నారు. దేవ స్థానాలు, హాస్పిటల్స్‌లో పారిశుద్ధ్య టెండర్లు కేంద్రీకృతం చేసి కమీషన్లు దండుకుంటున్నాయని ఆరోపించారు. యూరియా లేక రైతులు విలవిల్లాడుతున్నారన్నారు. 17 నెలల్లో రూ.2.10లక్షల కోట్లు అప్పు చేసిన ఏకై క సర్కార్ ఇదేనన్నారు. అమరావతి రాజధాని పేరుతో రూ.57వేలకోట్ల పనులకు టెండర్లు పిలిచి, 10 శాతం మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చి...తిరిగి ఆ నిధులను తమ ఖాతాల్లో వేసుకున్నారన్నారు. ఇప్పటి వరకూ అమరావతిలో కంపచెట్లు తొలగించడానికి, నీళ్లు తోడటానికే సరిపోయిందని, ఒక్క ఇటుక కూడా పేర్చలేదని ఎద్దేవా చేశారు. పిల్లి పాలుతాగుతూ ఎవరూ చూడలేదులే అనుకుంటుందని, టీడీపీ నేతల తీరు కూడా అదేవిధంగా ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో ఇంటికో విమానం ఇస్తామని హామీ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని ఈ ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
జీహెచ్‌ఎంసీ యాక్టుకు కాలం చెల్లింది
జీహెచ్‌ఎంసీ యాక్టుకు కాలం చెల్లిందని, ఆంధ్రప్రదేశ్ విడిపోయి 15ఏళ్లు కావొస్తున్నా ఇంకా జీహెచ్‌ఎంసీ యాక్టును పట్టుకొని వేలాడటం సరైందని కాదని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షం ఉండకూడదనే కసితో అంబేడ్కర్ రాజ్యాంగాన్ని ప్రక్కన బెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ పదవులు తీసేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే మాధవి భర్త శ్రీనివాసులరెడ్డి కాంట్రాక్టర్ కాదా.. అని ప్రశ్నించారు. కాలం చెల్లిన చట్టంతో పదవి తీసేయడం దుర్మార్గమని, కక్ష సాధింపులతో పదవులు ఊడగొట్టి రాక్షసానందం పొందుతున్నారన్నారు. సురేష్ బాబు కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని, చంద్రబాబు మూడేళ్లు అసెంబ్లీకి రాలేదు.. అప్పుడు ఆయన పదవి కోల్పో వాలి కదా.. వైఎస్ జగన్ పదవి రద్దు చేస్తామని ఇపుడు బెదిరించడం హాస్యాస్పదమన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాకా సురేష్, ఏపీ సోషల్ వెల్ఫేర్ బోర్డు మాజీ ఛైర్మెన్ పులి సునీల్ కుమార్, ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు ఎస్.వెంకటేశ్వర్లు, యువజన విభా గం నగర అధ్యక్షుడు గుంటి నాగేంద్ర, వలంటీర్ల విభాగం అధ్యక్షుడు ఫయాజ్ అహ్మద్ పాల్గొన్నారు.