
విద్యుత్తు సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు
ఎస్‌ఈ రమణ
కడప కార్పొరేషన్ : విద్యుత్తు సరఫరాలో అంతరాయం తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఏపీఎస్‌పీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ ఎస్.రమణ ఆదేశించారు. కడప ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్లను బుధవారం ఆయన క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అనంతరం కడప డివిజనల్ విద్యుత్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పారిశ్రామికవాడలో సరఫరాలో అంతరాయం ఏర్పడితే ఉత్పత్తి అనుకున్నంత మేర జరగదన్నారు. ప్రతి ఒక్కరూ విద్యుత్తు భద్రతా నియమాలు పాటించాలని, నిర్లక్ష్య ధోరణి వీడాలని సూచించారు. ఇండక్షన్ టెస్టర్‌ను ప్రతి ఒక్కరూ జేబులో ఉంచుకుంటే విద్యుత్ ప్రవాహాన్ని గుర్తించి ప్రమాదాలు నివారించవచ్చన్నారు. విద్యుత్ సమస్య వచ్చినప్పుడు క్షేత్రస్థాయి సిబ్బంది, అధికారులు మర్యాదపూర్వకంగా ప్రవర్తిస్తూ పరిష్కరించాలని సూచించారు. ఫ్యూజ్ ఆఫ్ కాల్స్, రీ కనెక్షన్ వంటివి వినియోగదారులు సకాలంలో పూర్తి చేయాలన్నారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులు, అధికారులను సన్మానించి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఈఈ హరిసేవ్యానాయక్, సుబ్రహ్మణ్యం, రామచంద్రారెడ్డి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.