
మహిళ హత్య కేసులో నిందితుడి అరెస్టు
పులివెందుల రూరల్ : మహిళ హత్య కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ మురళి నాయక్ తెలిపారు. ఆదివారం సాయంత్రం స్థానిక అర్బన్ పోలీస్ స్టేషన్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. గత నెల 30వ తేదీన బోనాల హసీనా అనే మహిళను హత్య చేశారన్నారు. రెండు రోజుల తర్వాత దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారన్నారు. సంఘటన స్థలానికి వెళ్లి అక్కడ ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా దేవిరెడ్డి లిఖిత్ కుమార్ రెడ్డిని విచారించామన్నారు. విచారణలో హసీనా వడ్డీ వ్యాపారం చేస్తూ ఉండేదని, ఈ నేపథ్యంలో కరుణ కుమారికి డబ్బులు ఇచ్చిందన్నారు. రెండేళ్లవుతున్నా డబ్బులు ఇవ్వకపోవడంతో డబ్బులు ఇవ్వాలని కఠినంగా అడగడంతో కరుణకుమారి కుమారుడు లిఖిత్ కుమార్ రెడ్డి గొంతు, చేతుల మీద కత్తితో పొడిచి చంపాడన్నారు. ఈ హత్యకు ప్రోత్సహించిన కరుణ కుమారిపై కూడా కేసు నమోదు చేశామని, ఆమె పరారీలో ఉందని త్వరలో అరెస్టు చేస్తామన్నారు. ఆదివారం మధ్యాహ్నం ఉల్లిమెల్ల రింగ్ రోడ్డులో ట్రాఫిక్ సీఐ హాజీవలీ, ఎస్‌ఐ నారాయణలు పోలీస్ సిబ్బందితో కలిసి లిఖిత్ కుమార్‌రెడ్డిని అరెస్ట్ చేశారన్నారు.