కడప అర్బన్ : యువత మత్తుకు అలవాటు పడి భవిష్యత్తును విచ్ఛిన్నం చేసుకోవద్దని, ప్రతి ఒక్కరూ తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని పలువురు వక్తలు పేర్కొన్నారు.
జిల్లా ఎస్పీ ఈ.జి. అశోక్ కుమార్ ఆదేశాల మేరకు నషా ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా ’ఈగల్’ టీం ఆధ్వర్యంలో కడప నగరంలోని రిమ్స్ ప్రభుత్వ వైద్య కళాశాలలో మంగళవారం యాంటీ డ్రగ్స్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా దివ్యాంగుల శాఖ ఏడీ కృష్ణ కిషోర్, రిమ్స్ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ విజయ్ భాస్కర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడారు. సమాజంలో యువత మత్తుకు అలవాటు పడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని చెప్పారు. అంతేగాక చిన్నచిన్న పరిశ్రమలలో పనిచేసే కార్మికులు, కూలీల కుటుంబాలు చిన్నాభిన్నం అయ్యే పరిస్థితులు దాపురిస్తున్నాయన్నారు. పిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రులు ఎంతో బాధ్యతగా ఉండాలన్నారు. అప్పుడే వారు ఉన్నతమైన స్థాయిలో ఉంటారన్నారు. మత్తు పదార్థాల సేవనం వల్ల మానసిక, శారీరక అనారోగ్యంతో పాటు ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతూ సమాజం నుండి దూరమవుతున్నారన్నారు. పలువురు మత్తు పదార్థాలకు అలవాటు పడి, డబ్బుల కోసం నేరాలకు, హత్యలకు సైతం పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దేశం అభివృద్ధి చెందాలంటే ప్రధానంగా యువత కీలకమని, ఎవరూ మత్తు పదార్థాల జోలికి వెళ్లకూడదని సూచించారు. మనమందరం సమష్టిగా మాదకద్రవ్య రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే విధంగా ముందుకెళ్లాలన్నారు. కళాశాల సమీపంలో, చుట్టుపక్కల ప్రాంతాలలో ఎవరైనా గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ వైద్య అధ్యాపకులు, వైద్య విద్యార్థులు, ఈగల్ సిబ్బంది పాల్గొన్నారు.
ఆపరేషన్ క్యాంపస్ సేఫ్ జోన్ స్పెషల్ డ్రైవ్
జిల్లా వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్ధల వద్ద 100 మీటర్ల దూరంలో సిగరెట్, పొగాకు సంబంధిత ఉత్పత్తుల విక్రయాన్ని నిషేధించారు. ఇందులో భాగంగా ’ఆపరేషన్ క్యాంపస్ సేఫ్‌జోన్’ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించాలని జిల్లా ఎస్పీ ఈ.జి. అశోక్ కుమార్ పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంగళవారం పోలీసు అధికారులు తమ పరిధిలోని ఆయా పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థలను సందర్శించి 100 మీటర్ల లోపు టీ షాపులు, పాన్ షాపులు, కిరాణా షాపులలో సిగరెట్లు, కై నీ, గుట్కా వంటి పొగాకు ఉత్పత్తులు అమ్మడం నిషేధమని షాప్ నిర్వాహకులకు తెలిపారు. విద్యా సంస్థల వద్ద పొగాకు ఉత్పత్తులను విక్రయించే షాపుల యజమానులకు జరిమానాలు విధించారు.
మత్తు పదార్థాల వల్ల జీవితం అంధకారం
యువతపై తల్లిదండ్రులు
ప్రత్యేక దృష్టి పెట్టాలి
యాంటీ డ్రగ్స్ అవగాహన సదస్సులో వక్తల పిలుపు
బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకుందాం