
పథకాలు ప్రజలకు పూర్తి స్థాయిలో అందాలి
కడప సెవెన్‌రోడ్స్ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నీ అర్హులైన ప్రజలకు పూర్తి స్థాయిలో అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సవిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా సమీక్షాకమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. అధికారులతోపాటు ప్రజాప్రతినిధులంతా జిల్లా అభివృద్దిలో భాగస్వాములు కావాలన్నారు. కలెక్టర్ డాక్టర్‌శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలన్నీ అమలు చేశామని పేర్కొన్నారు. ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో అన్ని రకాల ఇరిగేషన్ కాల్వల పనులను, గ్రామీణ రోడ్లు, కాంపౌండ్ వాల్స్, స్మశానాలకు ప్రహారీలు వంటి నిర్మాణాలను ఉపాధి నిధులతో పూర్తి చేశామన్నారు. అన్ని మండలాల్లో మినీ గోకులం షెడ్లతోపాటు రైతుల డిమాండ్లను బట్టి చిన్నచిన్న జీవాల షెడ్లను కూడా చేపడుతున్నామన్నారు. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ ద్వారా అధిక శాతం సబ్సిడీతో అన్ లిమిటెడ్ రుణ సాయం ఇస్తున్నామనే విషయాన్ని గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈనెల 10వ తేది అన్ని మండలాల్లోని పాఠశాలు, జూనియర్ కళాశాలల్లో నిర్వహించనున్న పేరెంట్స్, టీచర్స్ మీట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనిపిలుపునిచ్చారు. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ గోకులం భవనాలు, ఎన్టీఆర్ గృహ నిర్మాణాలకు సూర్యఘర్ పథకాన్ని అనుసంధించాలని కోరారు. ఎమ్మెల్యే మాధవీరెడ్డి మాట్లాడుతూ కడప కార్పొరేషన్ పరిఽధిలోని రైతులకు మినీ గురుకులాలు మంజూరు చేయాలన్నారు. ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ సీజన్ల వారీగా తెగుళ్ల నివారణ, ఎరువులవాడకంపై వ్యవసాయాధికారులు అవగాహన కల్పించాలన్నారు. ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్యరెడ్డి మాట్లాడుతూ సదరమ్ ఎంట్రీలు ఆన్‌లైన్‌లో మూడుసార్లు చేస్తే తర్వాత ఎంట్రీలు చేయడానికి సైట్‌లో అవకాశం ఉండదని, ఈ సాంకేతిక సమస్యను పరిష్కరించాలని కోరారు. సబ్సిడీ గ్యాస్, రేషన్, రేషన్‌కార్డులలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు.
డీఆర్సీ సమావేశంలో మంత్రి సవిత