
కదులుతున్న రైలు నుంచి దూకి తల్లీకూతుళ్లకు గాయాలు
జమ్మలమడుగు : ఎక్కాల్సిన రైలుకు బదులు పొరబాటున మరో రైలు ఎక్కిన తల్లీకూతుళ్లు తీరా రైలు కదులుతున్న సమయంలో కిందకు దూకేయడంతో ఇద్దరూ గాయపడ్డారు. ఈ సంఘటన ఎర్రగుంట్ల రైల్వేస్టేషన్‌లో జరిగింది. తల్లీకూతుళ్లయిన మహాలక్ష్మీ, శ్రీదేవి మంగళవారం మచిలీపట్నం నుంచి ధర్మవరం వెళ్లే రైలు కోసం ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్‌లో కూర్చున్నారు. అయితే ఇంతలో మరో రైలు రావడంతో అదే ధర్మవరం రైలు అనుకుని అందులో ఎక్కారు. తీరా కదులుతున్న సమయంలో ఇది ధర్మవరం రైలు కాదని మీరు వెళ్లాల్సిన రైలు మరొకటి అని తోటి ప్రయాణికులు చెప్పారు. అప్పటికే రైలు కదిలింది. దీంతో మహాలక్ష్మీ, శ్రీదేవి వేగం పుంజుకుంటున్న రైలులో నుంచి ఒక్కసారిగా దూకేశారు. తల్లి మహాలక్ష్మీకి స్వల్ప గాయాలు కాగా కుమార్తె శ్రీదేవి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. వెంటనే అక్కడ ఉన్న రైల్వే పోలీసులు ఏఏస్‌ఐ సలాం, సుబ్బరాయుడు పరుగున వచ్చి బాధితులకు ప్రాథమిక చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ప్రొద్దుటూరుకు తరలించారు.