
బాలిక అదృశ్యం కేసులో నిందితుడి అరెస్టు
వేంపల్లె : బాలిక అదృశ్యం కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ తెలిపారు. శనివారం వేంపల్లె పోలీస్ స్టేషన్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 7వ తేదీన వేంపల్లి పంచాయతీ పక్కీరుపల్లెకు చెందిన బాలిక గొర్రెలను మేపుకునేందుకు అడవిలోకి వెళ్లి అదృశ్యమైన ఘటనపై వేంపల్లె పోలీస్ స్టేషన్‌లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారన్నారు. సీఐ నరసింహులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారని తెలిపారు. చింతలమడుగుపల్లె గ్రామానికి చెందిన మడకా బాబు చైన్నెలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుండేవాడని, పక్కనే ఉన్న పక్కీరుపల్లెకు చెందిన బాలికతో ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచయమయ్యాడన్నారు. బాలికకు మాయమాటలు చెప్పి తరచూ వీడియో కాల్స్ మాట్లాడేవాడన్నారు. ఈనెల 5వ తేదీన చైన్నె నుంచి మడకా బాబు సొంత గ్రామానికి వచ్చాడన్నారు. 7వ తేదీ ఉదయం బాలిక చింతలమడుగుపల్లె గ్రామ సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో వజ్రాలకోట వద్దకు గొర్రెలను మేపుకునేందుకు వెళ్లిందన్నారు. విషయం తెలుసుకుని అక్కడికి వెళ్లిన బాబు బాలికతో మాట్లాడుతున్న సమయంలో గొర్రె పిల్లలు పక్కనే ఉన్న రాఘవరెడ్డి అనే వ్యక్తి పొలంలోకి వెళ్లాయన్నారు. అక్కడ గొర్రె పిల్లలు మాత్రమే ఉండటంతో బాలిక తండ్రికి రాఘవరెడ్డి భార్య ఫోన్ చేసిందన్నారు. అతను అక్కడికి వెళ్లేసరికి కూతురు కనిపించకపోవడంతో మడకా బాబుపై అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. దీంతో మడకా బాబుతోపాటు అతని స్నేహితులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి విచారించే సమయంలో పోలీస్ స్టేషన్‌పై బాలిక బంధువులు, గ్రామస్తులు దాడి చేశారని తెలిపారు. అదే రోజు రాత్రి 10 గంటల సమయంలో బాలిక ఆచూకీ తెలిసిందన్నారు. అపస్మారక స్థితిలో ఉన్న బాలికను కడప రిమ్స్‌కు తరలించామన్నారు. బాలికను విచారించి మైనర్ కావడంతో మడకా బాబుపై పోక్సో చట్టం కింద అత్యాచారం కేసు నమోదు చేసి అరెస్టు చేశామన్నారు. నిందితుడిని జమ్మలమడుగు కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు పంపనున్నట్లు తెలిపారు. సమావేశంలో సీఐ నరసింహులు, ఎస్‌ఐ రంగారావు, పోలీసులు పాల్గొన్నారు.
పోక్సో కేసు నమోదు