
బంగారు భవితకు బాటలు వేసుకోవాలి
కడప అర్బన్ : విద్యార్థి దశలో లక్ష్యాన్ని నిర్దేశించుకుని, దాన్ని సాధించేందుకు కార్యాచరణ రూపొందించుకుని కష్టపడితే విజయం మీ సొంతమవుతుందని జిల్లా ఎస్పీ ఈ.జి. అశోక్ కుమార్ పేర్కొన్నారు. శనివారం స్థానిక పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో పోలీసు సంక్షేమంలో భాగంగా టెన్త్, ఇంటర్‌లో ప్రతిభ కనబరిచిన 63 మంది పోలీసు, హోమ్‌గార్డులు, డీపీఓ సిబ్బంది కుటుంబాల పిల్లలకు నగదు ప్రోత్సాహక మెరిట్ స్కాలర్‌షిప్‌లు, ప్రశంసా పత్రాలను జిల్లా ఎస్పీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాగా చదివి బంగారం లాంటి భవిష్యత్తుకు బాటలు వేసుకుని అత్యున్నత స్థాయికి ఎదిగేందుకు కృషి చేయాలని సూచించారు. పోలీసుల పిల్లలు చక్కగా చదివి మంచి మార్కులు సాధించి మెరిట్ స్కాలర్ షిప్ అందుకోవడం ప్రశంసనీయమన్నారు. ఈ స్ఫూర్తితో మున్ముందు రెట్టింపు కృషితో, చదువులో ఉత్తమ ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. విద్యార్థులు వారు ఎంచుకున్న రంగంలో, వృత్తిలో రాణించేందుకు, ఉన్నత లక్ష్యాలను అధిరోహించేందుకు తల్లిదండ్రుల ప్రోత్సాహం తప్పని సరిగా ఉండాలన్నారు. అప్పుడే వారు లక్ష్యాలను సునాయాసంగా చేరుకోగలరన్నారు. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆరోగ్యం కాపాడుకోవాలన్నారు. పోలీస్ సంక్షేమంలో భాగంగా సిబ్బందికి వైద్య పరీక్షలు, అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవలు అందించడంలో పోలీస్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దూలం సురేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉప్పు శంకర్ చేస్తున్న కృషిని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏ.ఆర్. అదనపు ఎస్పీ బి.రమణయ్య, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసరావు, ఆర్.ఐ. శ్రీశైల రెడ్డి, ఆర్.ఎస్.ఐ. వెంకటేశ్వర్లు, పోలీస్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దూలం సురేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉప్పు శంకర్, కార్యవర్గ సభ్యుడు ఏఫ్రిన్, పోలీస్, హోమ్ గార్డు, డీపీఓ సిబ్బంది కుటుంబ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.
జిల్లా ఎస్పీ ఈ.జి. అశోక్ కుమార్
పోలీసు కుటుంబాల పిల్లలకు మెరిట్ స్కాలర్‌షిప్‌లు, ప్రశంసా పత్రాలు అందజేత