
ప్రమాదవశాత్తు మంటలు..
మోటార్ బైకు, ఇతర సామగ్రి దగ్ధం
వేంపల్లె : వేంపల్లెలోని స్థానిక రాయచోటి బైపాస్ రోడ్డులో ఉన్న ఇంటిలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించడంతో మోటార్ బైకు, వాకిళ్లు, మోటార్‌తోపాటు ఇతర సామగ్రి దగ్ధమయ్యాయి. శనివారం మధ్యాహ్నం వేంపల్లెలోని రాయచోటి బైపాస్ రోడ్డులో ఉన్న ఇంటిలో నుండి పొగ వ్యాపిస్తుండటంతో అ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఫైర్ స్టేషన్‌కు సమాచారమందించారు. దీంతో ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఫైర్ సిబ్బంది వచ్చేసరికి ఇంటి ఆవరణంలో ఉన్న మోటార్ బైకు, మరుగుదొడ్లకు చెందిన వాకిళ్లు, కిటికీలు, తాగునీటికి చెందిన మోటార్ పూర్తిగా కాలిపోయాయి. ఈ సందర్భంగా బాధితుడు గోవర్దన్ మాట్లాడుతూ ఈ అగ్ని ప్రమాదంలో లక్ష రూపాయల వరకు నష్టం వాటిల్లిందన్నారు. ఫైర్ సిబ్బంది సమయానికి రావడంతో ఇంటి లోపల ఉన్న వడ్ల బస్తాలు అగ్ని ప్రమాదంలో కాలిపోలేదన్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో జరిగిందా లేక ఇంటి సమీపంలో ఉన్న టైర్లకు ఎవరైనా అగ్గి పెట్టడంవల్ల ఈ ప్రమాదం జరిగిందా అని బాధితుడు అనుమానం వ్యక్తం చేస్తున్నాడు.