
వైభవంగా హుసేనిపీర్ దర్గా ఉరుసు
బద్వేలు అర్బన్ : పట్టణంలోని దర్గా వీధిలో వెలసిన హుసేనిపీర్ దర్గా 200వ ఉరుసు మహోత్సవాలు స్వామి ఐదవ తరం వారసులు మున్వర్‌బాషా, సలీం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా దర్గాను విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. కుల, మతాలకు అతీతంగా భక్తులు అధికసంఖ్యలో పాల్గొని ప్రార్థనలు నిర్వహించారు. మత సామరస్యానికి ప్రతీకగా జరిగే ఈ ఉరుసు మహోత్సవంలో.. బద్వేలు నియోజకవర్గంతోపాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన హిందూ, ముస్లిలు అఽధిక సంఖ్యలో పాల్గొని ప్రార్థనలు చేశారు. మొక్కుబడి ఉన్న భక్తులు దర్గా ఆవరణలో అన్నదానం నిర్వహించి తమ మొక్కులను చెల్లించుకున్నారు. సోమవారం తెల్లవారుజామున స్వామి వారికి గంధం ఎక్కించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో స్వామి వారసులు దర్గా రహమతుల్లా, దర్గా షఫివుల్లా, దర్గా కరీముల్లా, ఆర్గనైజర్లు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.