పెళ్లి పీటలు ఎక్కాల్సిన వారికి..
త్వరలో పెళ్లి పీటలు ఎక్కాల్సిన వారికి.. కన్నీటి వీడ్కోలు పలికారు. రైల్వేకోడూరు మండలం శెట్టిగుంట సమీపంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో బావమరదలు మృతి చెందిన విషయం తెలిసిందే. వారి మృతదేహాలకు ఆదివారం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో ఆర్తనాదాలు మిన్నంటాయి. ‘మీ పెళ్లి చేసి మురిసిపోదామనుకుంటే.. ఇలా జరిగిందేమిటి!’.. దేవుడా అంటూ కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు విషాద వదనంలో మునిగిపోయారు.
ఓబులవారిపల్లె : చిన్ననాటి నుంచి కలిసి పెరిగారు. యుక్త వయస్సు రాగానే ప్రేమించుకొని పెద్దలను ఒప్పించి వివాహానికి సిద్ధమయ్యారు. రెండు నెలల్లో పెళ్లి.. అంతలోనే మృత్యుఒడికి చేరుకున్నారు. మరణంలోనూ వారు ఒకరికొకరు తోడుగా వెళ్లిపోయారు. రైల్వేకోడూరు మండలం శెట్టిగుంట సమీపంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరి విషాద గాథ ఇది. వివరాల్లోకి వెళ్తే.. మండల కేంద్రంలోని వైకోట రోడ్డు సమీపంలో నివాసం ఉంటున్న రిటైర్డ్ కండక్టర్ వనమాల శ్రీనివాసులు, వనమాల ప్రభావతికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్దకుమారుడు అజయ్ కృష్ణ, చిన్న కుమారుడు సాయి కృష్ణ. పెద్ద కుమారుడు అజయ్ చిట్వేలి గ్రామానికి చెందిన సాతుపాడి నాగయ్య నాల్గవ కుమార్తె మాధవిని వివాహం చేసుకున్నాడు. మాధవి తల్లిదండ్రులు ఇద్దరూ అప్పటికే చనిపోయి ఉండటంతో.. తన చిన్న చెల్లెలు అనితను చిన్నప్పుడే తనతోపాటు అత్తగారింటికి తీసుకొచ్చింది. అనిత ఇక్కడే హైస్కూల్‌లో చదివి పుల్లంపేటలో ఇంటర్మీడియెట్ పూర్తి చేసింది. నవమాల శ్రీనివాసులు రెండవ కుమారుడు సాయి కృష్ణ డిగ్రీ వరకు చదివాడు. చిప్పన్పటి నుంచి సాయి కృష్ణ, అనిత ఇద్దరూ కలిసి పెరగడంతో వారి మధ్య ప్రేమ చిగురించింది. పెద్దలు మొదట్లో ఒప్పుకోకపోయినా.. తర్వాత ఒప్పించి వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇంకా రెండు నెలలకు అనిత మైనార్టీ తీరిన తరువాత వివాహం చేద్దామని పెద్దలు నిర్ణయించుకొని అన్ని సిద్ధం చేసుకున్నారు.
కబళించిన రోడ్డు ప్రమాదం
ఈ క్రమంలో విధి వీరి జీవితాలతో ఆడుకుంది. సాయికృష్ణ (24)కు రైల్వేకోడూరు ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో ఇటీవల ఉద్యోగం వచ్చింది. చేరేందుకు స్కూటీపై శనివారం రైల్వేకోడూరుకు వెళ్లాడు. అక్కడ ఉండేవారు తిరుపతికి వెళ్లాలని చెప్పడంతో తిరుపతికి వెళ్లాడు. ఇంటి వద్ద ఉన్న మరదలు అనిత నంద్యాల డెమో రైలులో తిరుపతికి వెళ్లింది. ఇద్దరు కలిసి తిరుపతిలో ఉంటున్న అజయ్ కృష్ణతో మాట్లాడారు. సాయంత్రం అనిత, సాయికృష్ణ స్కూటీపై తిరుపతి నుంచి ఇంటికి బయలు దేరారు. రైల్వేకోడూరు మండలం శెట్టిగుంట సమీపానికి రాగానే.. వేగంగా ఎదురుగా వచ్చిన గుర్తు తెలియని లారీ ఢీకొంది. ఇద్దరిపై నుంచి లారీ వెళ్లడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. ఓబులవారిపల్లిలోని ఆస్పత్రిలో ఆదివారం ఉదయం మృతదేహాలకు పోస్టు మార్టం నిర్వహించారు. అనంతరం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. అందరితో కలిసి మె లిసి మంచి వాడు అన్న పేరు ఉన్న సాయికృష్ణ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నా యి. బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదించారు. మృతదేహాలను సర్పంచ్ ఎన్‌పీ జయపాల్‌రెడ్డి సందర్శించి నివాళులు అర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.
రైల్వేకోడూరు రోడ్డు ప్రమాద
మృతులకు ఘన నివాళి
రెండు నెలల్లో వివాహం..
అంతలోనే మృత్యు ఒడికి
మరణంలోనూ ఒక్కటై..
శోక సముద్రంలో కుటుంబ సభ్యులు,
బంధుమిత్రులు
కన్నీటి వీడ్కోలు
కన్నీటి వీడ్కోలు
కన్నీటి వీడ్కోలు