
కార్మికుల సమ్మె బాట
కడప కార్పొరేషన్ : కడప నగరపాలక సంస్థ కార్మికులు శనివారం అర్థరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్లారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని సుమారు నెల రోజుల నుంచి వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తున్న కార్మికులు చివరి అస్త్రంగా సమ్మెబాట పట్టారు. దీంతో నగరంలో తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ వంటి సేవలు బంద్ అయ్యాయి. నగరంలోని చాలా ప్రాంతాల్లో ఆదివారం తాగునీటి సమస్యలు ఏర్పడ్డాయి. కొళాయిల్లో నీటి సరఫరా కాకపోవడంతో ప్రజలు ప్రైవేటు ట్యాంకర్ల కోసం పరుగులు పెడుతున్నారు. కడప నగర పరిధిలో సుమారు 400 మంది ఇంజినీరింగ్ కార్మికులు సమ్మెలోకి వెళ్లడంతో కడప నగరానికి ప్రధానంగా తాగునీటిని సరఫరా చేసే గండి, లింగంపల్లి పంపింగ్ స్కీంల వద్ద ముందస్తుగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. తాగునీరు, వీధి దీపాల నిర్వహణ కోసం నగరపాలక అధికారులు సచివాలయ ఉద్యోగుల ద్వారా తాత్కాలిక సిబ్బందిని నియమించి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తున్నప్పటికీ అవి సత్ఫలితాలను ఇవ్వలేదు.
పంపిణీ వ్యవస్థలో సమస్యలు ఉన్నాయి: ఎస్‌ఈ
తాగునీటి పంపింగ్ వ్యవస్థ సక్రమంగా ఉందని, ఫిట్టర్లు అంతా సమ్మెలోకి వెళ్లడంతో డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలో సమస్యలు వస్తున్నాయని నగరపాలక ఎస్‌ఈ చెన్నకేశవరెడ్డి తెలిపారు. సచివాలయ ఉద్యోగులు, తాత్కాలిక సిబ్బందితో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.
లింగంపల్లి పంపింగ్ స్కీమ్ వద్ద
పోలీసు బందోబసు
సిద్దవటం : మండలంలోని లింగంపల్లి పెన్నానది నుంచి కడప నగరానికి పంపింగ్ స్కీమ్ ద్వారా వెళ్లే మంచి నీటి ట్యాంకు వద్ద ఎస్‌ఐ మహమ్మద్‌రఫీ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో అసిస్టెంటు ఏఈ అంజనీకుమార్, స్థానిక పోలీసులు రాఘవ, కిరణ్, కుమార్ పాల్గొన్నారు.
డిమాండ్లపై స్పందించని ప్రభుత్వం
మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులకు జీవో నంబర్ 36 ప్రకారం రూ.24,500 వేతనాలు పెంచాలని, కార్మికుల రిటైర్‌మెంట్‌ను 62 ఏళ్లకు పెంచి, రిటైర్‌మెంట్ బెనిఫిట్లు ఇవ్వాలని, రిటైర్‌మెంట్ అయిన కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని కోరుతున్నా రు. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించిన పాపాన పోలేదని కార్మికులు విమర్శిస్తున్నారు. 12వ తేది అర్థరాత్రి నుంచి సమ్మె చేస్తామని ముందే తెలియజేసినప్పటికీ తమతో చర్చించి సమ్మె నివారణ యత్నాలు చేయలేదని చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కార్మికులతో చర్చించి సమ్మె నివారణకు కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
12 నుంచి ఇంజినీరింగ్
కార్మికుల సమ్మె
తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ బంద్
ప్రజా సమస్యలు పట్టించుకోని కూటమి ప్రభుత్వం

కార్మికుల సమ్మె బాట